సిటీబ్యూరో, జనవరి 19 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ సర్కారు ప్రతిపాదించిన ఎలివేటెడ్ కారిడార్ వివాదాల్లో చిక్కుకుంటున్నది. ఓ వైపు న్యాయపోరాటం, మరోవైపు డిమాండ్ల సాధనకు రెండేండ్లుగా రాజీవ్ రహదారి భూ యజమానులు ఉద్యమిస్తున్నారు. అయినా ఎలివేటెడ్ కారిడార్‌లో గుర్తించిన ఆస్తులకు పరిహారాన్ని తేల్చలేదు. కానీ పరిహారంపై స్పష్టత ఇవ్వకుండా సర్కారు బాధితులకు జీవనాధారమైన ఆస్తులను లాక్కునే ప్రయత్నం చేస్తున్నది. తాజాగా భూములు కోల్పోతున్న వారికి పరిహారంగా టీడీఆర్ మంజూరు చేసే యోచనలో ఉన్నామంటూ వస్తున్న ఊహాగానాలపై బాధితులు లబోదిబోమంటున్నారు. ఇప్పటికే భూముల విషయంలో ఎటూ తేల్చని సర్కారు, టీడీఆర్ రూపంలో చెల్లించే పరిహారంతో ఉన్నది మొత్తం నష్టపోతామని వాపోతున్నారు. నిజంగా ప్రభుత్వానికి ఎలివేటెడ్ విషయంలో స్పష్టత ఉంటే.. ముందుగా ప్రాజెక్టు పరిహారం, రెండు వందల ఫీట్ల నుంచి 150ఫీట్లకు ప్రాజెక్టు వెడల్పు తగ్గించిన తర్వాతే తమతో చర్చలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
ఒక్క ప్రతిపాదనతో..
ఒక్క ప్రతిపాదనతో వందలాది మందిని కోర్టుల చుట్టూ తిరిగేలా చేస్తున్న కాంగ్రెస్ సర్కారు.. ఎలివేటెడ్ విషయంలో జనాలను నిండా ముంచే ప్రయత్నాలను ముమ్మరం చేసినట్లుగా ఉంది. దీనిలో భాగంగా ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టులో గుర్తించిన 1500కు పైగా ఆస్తులకు చెల్లించాల్సిన పరిహారాన్ని నాన్చుతున్నది. కనీసం ప్రాజెక్టు నిర్మాణ తీరుతెన్నులను దాచిపెడుతుండగా 150 ఫీట్ల లోపే ప్రాజెక్టు వెడల్పు ఉండాలనే డిమాండ్‌ను పరిగణనలోకి కూడా తీసుకోవడం లేదు. ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన నుంచి భూసేకరణ నోటిఫికేషన్ జారీ చేసిన నాటికి కూడా సర్కారు పరిహారం విషయంలో స్పష్టత ఇవ్వలేదు. ముఖ్యంగా ఆ ప్రాంతం నగరంలోని ప్రధాన వాణిజ్య కేంద్రాల్లో ఒకటి కావడంతో బాధితులు కూడా సాధారణ పరిహారానికి అంగీకరించడం లేదు.
కోల్పోతున్న భూమి మార్కెట్ విలువ ఆధారంగానే పరిహారం ఇవ్వాలని మొదటి నుంచి కోరుతున్నారు. కానీ సర్కారు మాత్రం ఈ విషయంలో మౌనంగా ఉంటూనే బాధితులను భయపెడుతున్నది. పరిహారాన్ని టీడీఆర్ రూపంలో చెల్లిస్తామని చెబుతూ, భూ సేకరణకు సహకరించాలని ఒత్తిడి చేస్తున్న ది. అయితే సర్కారు ఇచ్చే పరిహారం, ఇ ప్పు డు మార్కెట్ విలువకు మధ్య భారీ వ్యత్యాసం ఉండటంతో ఏటూ తేల్చుకోలేకపోతున్నారు. పరిహారాన్ని టీడీఆర్ రూ పంలోనే చెల్లిస్తామంటూ వస్తున్న ఊహాగానాలతో బాధితులు ఆందోళన చెందుతున్నా రు. టీడీఆర్ ద్వారా చెల్లించే పరిహారంతో తమ ఆస్తుల విలువ సగానికిపైగా పడిపోతుందంటున్నారు. సర్కారు వద్ద భూసేకరణకు కూడా సరిపడా నిధులు లేకపోవడం తో ప్రాజెక్టును పట్టాలెక్కించడానికి మెలికలతో జనాలను ఇబ్బంది పెడుతున్నది.