బంజారాహిల్స్,మే 9: జూబ్లీహిల్స్‌లోని ప్రశాసన్‌నగర్‌లోని ప్లాట్ నెంబర్ 46లో నివాసం ఉంటున్న విశ్రాంత ఐపీఎస్ అధికారి వినయ్ రంజన్ రే సతీమణి తనూజ రంజన్(60)ను శుక్రవారం తెల్లవారుజామున పనిమనిషి కల్పనతో పాటు మరో ముగ్గురు నేపాలీ గ్యాంగ్ సభ్యులు కలిసి హత్య చేసి బంగారం,నగదు దోచుకుని వెళ్లిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టించింది. నిందితులను పట్టుకునేందుకు పోలీసుల వేట కొనసాగుతున్నది. నిందితులు వెళ్లిన మార్గాల్లో సీసీ ఫుటేజీని సేకరించిన పోలీసులు వారిని పట్టుకునేందుకు గాలింపు చేపట్టారు.
ఇటీవల వైద్యం కోసం వినయ్‌రంజన్ బెంగళూర్‌కు వెళ్లడానికి ముందు పెద్ద ఎత్తున నగదును తీసుకువచ్చి ఇంట్లో భద్రపరచడాన్ని కల్పన గమనించడంతో చోరీకి ప్లాన్ చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నగదును భద్రపర్చిన విషయాన్ని నేపాలీ గ్యాంగ్ సభ్యులకు చేరవేసిన తర్వాత అదును కోసం వేచి చూశారని, వినయ్‌రంజన్ వైద్యం కోసం బెంగళూరుకు వెళ్లిన తర్వాత చోరీ చేయాలని నిర్ణయించుకుని వారిని పిలిపించినట్లు పోలీసులు గుర్తించారు.
కాగా, నిందితులను పట్టుకునేందుకు 10 బృందాలు రంగంలోకి దిగాయి. నిందితులు చోరీ అనంతరం తెలంగాణ ఎక్స్‌ప్రెస్ ఎక్కినట్లు అనుమానిస్తున్నారు. తెల్లవారుజామున 2.30 ప్రాంతంలో ఘటనా స్థలం నుంచి గ్యాంగ్ బయటకు వెళ్లగా, ఉదయం 9.40 ప్రాంతంలో కుటుంబసభ్యులు గుర్తించారు. ఉదయం 10గంటల ప్రాంతంలో పోలీసులకు సమాచారం అందించారు. ఈ 8 గంటల వ్యవధిలో నేపాలీ గ్యాంగ్ సభ్యులు రాష్ట్రం దాటి ఉంటారని తెలుస్తోంది.