శేరిలింగంపల్లి, జూలై 29 : ఐటీ ఉద్యోగిని స్కూటీపై వెళ్తుండగా వాటర్ ట్యాంకర్ ఢీకొట్టి దుర్మరణం చెందిన సంఘటన రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. ఇరువురి శాలిని (38).. భర్త వెంకటేశ్వర్లు, తన ఇద్దరు పిల్లలు సుదీక్ష, సహస్రతో కలిసి మణికొండలో నివాసం ఉంటోంది. శాలిని ఓ ఐటీ కంపెనీలో సాప్ట్వేర్ ఉద్యోగినిగా పనిచేస్తుండగా కొంతకాలంగా భర్త వెంకటేశ్వర్లు వృత్తిరీత్యా అంధ్రప్రదేశ్‌లో నివసిస్తున్నాడు.
కాగా, మంగళవారం ఉదయం ఇంటివద్ద స్కూల్ బస్ మిస్‌కావడంతో ఇద్దరు పిల్లలను తన స్కూటీపై ముందు స్టాప్‌లో స్కూల్ బస్ ఎక్కించిన శాలిని తిరిగి ఇంటికి వస్తున్న క్రమంలో మణికొండ సుందర్ గార్డెన్ సమీపంలో వేగంగా, నిర్లక్ష్యంగా వచ్చిన ఓ వాటర్‌ట్యాంకర్ స్కూటీని ఢీకొట్టింది. ప్రమాదంలో తలకు తీవ్రగాయాలవడంతో శాలిని అక్కడికక్కడే మృతిచెందింది. రాయదుర్గం పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. శాలిని తమ్ముడు తమ్మినేని లోకేశ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలంలోని సీసీటీవీ పుటేజీని పరిశీలిస్తున్నారు.