సిటీ బ్యూరో, ఫిబ్రవరి 1 (నమస్తే తెలంగాణ): తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను రాజకీయంగా వేధింపులకు గురిచేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యాంగాన్ని కాలరాస్తున్నదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు. ఎన్ని కుట్రలు చేసినా కేసీఆర్ నిరంతరం తెలంగాణ ప్రజల కోసం పోరాటం చేస్తూనే ఉంటారని అన్నారు. దొంగతనంగా రాత్రికి రాత్రి పోలీసులు కేసీఆర్ నివాసం నందినగర్ ఇంటి గోడకు నోటీస్ అంటించారని విమర్శించారు.
కనీసం సుప్రీం కోర్టు గైడ్ లైన్స్ పాటించకుండా నోటీసులు ఇవ్వడం కాంగ్రెస్ ప్రభుత్వం తీరుకు నిదర్శనంగా నిలుస్తున్నదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్రెడ్డి ఎన్ని కుట్రలు చేసినా కేసీఆర్ స్థాయిని తగ్గించలేరని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ర్టాన్ని సాధించి, పదేండ్లు అభివృద్ధి పథంలో అగ్రభాగాన నిలిపిన అపర భగీరథుడు కేసీఆర్ అని, అలాంటి వ్యక్తిని సిట్ పేరిట విచారణ చేయడం సరికాదన్నారు. విచారణ పేరుతో పోలీసులు హైదరాబాద్ నగరాన్ని అష్టదిగ్బంధనం చేశారని, పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని వేధింపులకు పాల్పడినా ప్రజల పక్షాన పోరాటాలు కొనసాగిస్తునే ఉంటామని తెలిపారు. కాంగ్రెస్ అరాచక పాలనకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాలు చేపడుతామని అన్నారు. పాలన చేతకాక, ఇచ్చిన హామీలు అమలు చేయలేక ఇలాంటి డైవర్షన్ డ్రామాలు ఆడుతున్నారని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండేండ్లలో డైవర్షన్లు నిత్యకృత్యంగా మారాయని చెప్పారు.