జూబ్లీహిల్స్,జూలై5: ప్రతి వ్యక్తి ఓటు హక్కును కాపాడుకోవాలని.. ప్రజలను మోసం చేసే ప్రభుత్వాలకు బుద్ధి చెప్పేందుకు ఆ ఓటును ఆయుధంగా మలచుకోవాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఆదివారం బంజారాహిల్స్‌లోని తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ఇన్చార్జి మాగంటి సునీతాగోపీనాథ్ ఆధ్వర్యంలో ప్రత్యేక ఓటరు సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమంపై జూబ్లీహిల్స్ నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ ఎన్నికల సంఘం చేపడుతున్న సర్‌పై బూత్ లెవల్ ఏజెంట్లు, బీఆర్ఎస్ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలన్నారు. కాంగ్రెస్ రెండున్నర సంవత్సరాల్లో ఏం చేశారో చెప్పకుండా గత ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేయడం కేవలం ప్రజల దృష్టి మళ్లించడానికేనన్నారు. పదేండ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణ ప్రభుత్వం రూ.4 లక్షల కోట్ల అప్పులు చేస్తే అందులో సాగునీటి ప్రాజెక్ట్‌లను నిర్మించి లక్షల ఎకరాలకు సాగునీరు అందించిందని.. చెరువుల్లో పూడిక తొలగించి భూగర్భ జలాలను పెంపొందించారని.. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ తాగునీరు అందించారని.. యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి దేవాలయాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారని మాజీ మంత్రి తలసాని తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం రెండున్నర సంవత్సరాల్లోనే రూ.4 లక్షల కోట్ల అప్పులతో ప్రజలకు ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చేందుకే కాంగ్రెస్ మోసపూరిత హామీలు ఇచ్చిందని ప్రజలు గుర్తించారని.. హామీలపై ప్రశ్నిస్తే ప్రతిపక్ష నాయకులపై తప్పుడు ప్రచారం చేస్తూ అక్రమ కేసులు పెడుతుండడాన్ని కూడా గమనిస్తున్నారన్నారు. మహిళలకు కాంగ్రెస్ ఇచ్చిన హామీల్లో మచ్చుకు ఒకటి రెండు చెప్పుకుంటే వారి పాలన ఎలా ఉందో తెలిసిపోతుందని, విద్యార్థినులకు స్కూటీలు, మహిళలకు రూ. 2500 ఆర్థిక సహాయం, కల్యాణలక్ష్మి పథకంలో తులం బంగారం తదితర హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. రైతులను, నిరుద్యోగులను నిలువునా ముంచిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందని ఎద్దేవా చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సమయంలో స్వ యంగా సీఎం రేవంత్‌రెడ్డి అనేక హామీలు ఇచ్చినా అవి అమలుకు నోచుకోలేదన్నారు.
సీఎం స్థాయిని మరిచిపోయి బూతు భాష మా ట్లాడుతూ రేవంత్‌రెడ్డి ఆ స్థానానికి ఉన్న గౌరవాన్ని దిగజార్చుతున్నారన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను, రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీలను అమలుచేయకుండా మోసం చేసిన తీరును ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కష్టపడే వారికే టికెట్లు వస్తాయని తెలిపారు. బీఆర్ఎస్ నేత రావుల శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేందుకు ఎన్ని హామీలు ఇచ్చారో వాళ్లకే తెలియదన్నారు. ఎమ్మెల్సీ సురభి వాణీదేవి, బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ దినేశ్ చౌదరి, మాజీ కార్పొరేటర్ షఫి, నాయకులు నవీన్ తదితరులు పాల్గొన్నారు.