బేగంపేట్ జూన్ 15: బోనాల ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తామని అందుకు అన్ని ఏర్పాట్లు చేస్తామని తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. గురువారం సికింద్రాబాద్‌లోని శ్రీ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి ఆలయం వద్ద వచ్చే నెల 9న నిర్వహించే బోనాలు, 10న నిర్వహించే రంగం, అంబారీపై అమ్మవారి ఊరేగింపు నిర్వహణ ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే సీఎం కేసీఆర్ ఆషాఢ బోనాల ఉత్సవాలను రాష్ట్ర పండుగగా ప్రకటించారన్నారు. నాటి నుంచి ప్రభుత్వం ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేస్తూ ఘనంగా నిర్వహిస్తూ వస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. ఈ సంవత్సరం కూడా అంగరంగా వైభవంగా నిర్వహిస్తామని, లక్షలాదిగా వచ్చే భక్తులు ఎలాంటి అసౌకర్యానికి గురి కాకుండా జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో బోనాల ఉత్సవాలకు అరకొర ఏర్పాట్లు చేసేవారని పేర్కొన్నారు. మన సంస్కృతికి ప్రతీకగా నిలిచే బోనాల ఉత్సవాలను ప్రజలు సంతోషంగా గొప్పగా జరుపుకోవాలనే ఆలోచనతోనే ప్రైవేట్ దేవాలయాలకు కూడా ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తుందని, ఇందుకోసం ఈ సంవత్సరం 15 కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేసిందని వివరించారు.
ఆలయ కమిటీల నిర్వాహకులు తమ దరఖాస్తులను త్వరితగతిన దేవదాయ శాఖ అధికారులకు అందజేయాలని సూచించారు. అదే విధంగా బంగారు బోనం చేయించి అమ్మవారికి బోనం సమర్పిస్తున్నట్టు తెలిపారు. ఈ సంవత్సరం కూడా వెయ్యిమంది సాంస్కృతిక శాఖ కళాకారుల ప్రదర్శనతో అమ్మవారికి బంగారు బోనం సమర్పించనున్నట్టు పేర్కొన్నారు. ప్రశాంత వాతావరణంలో బోనాల ఉత్సవాలు జరిపేందుకు అధికారులు అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆర్య సమాజ్, దక్కన్ మానవ సేవా సమితి , భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ తదితర స్వచ్ఛంద సంస్థల సభ్యులు ప్రతి యేడాది బోనాల సందర్భంగా భక్తులకు తమ సేవలను అందిస్తారని ప్రశంసించారు. వివిధ శాఖల మధ్య సమన్వయం కోసం ప్రత్యేక కంట్రోల్ రూంను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ప్రజలు సంతోషంగా ఉండాలి పండుగలు గొప్పగా జరుపుకోవాలి అనేది ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన అని మంత్రి వివరించారు. ఈ సమావేశంలో జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్‌కుమార్, జలమండలి ఎండీ దానకిశోర్, కార్పొరేటర్లు చీర సుచిత్ర, మాజీ కార్పొరేటర్ అరుణాగౌడ్, దేవదాయ అదనపు కమిషనర్ జ్యోతి, ఆలయ ఈవో గుత్తా మనోహర్‌రెడ్డి, నార్త్ జోన్ డీసీపీ చందనాదీప్తి, అడిషనల్ ట్రాఫిక్ డీసీపీ రంగారావు, అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఆర్డీవో వసంతకుమారి, జిల్లా వైద్యా ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ వెంకటి పాల్గొన్నారు.