సిటీబ్యూరో, జూలై 10 (నమస్తే తెలంగాణ): మహంకాళి బోనాల ఉత్సవాల్లో భాగంగా సోమవారం జగన్మాత గజవాహనంపై శోభాయమానంగా ఊరేగింది. రెండో రోజు లష్కర్‌లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర వైభవంగా ముగిసింది. అంబారీపై అమ్మవారి ఉత్సవమూర్తులను అధిష్టింపజేసి పురవీధుల మీదుగా నేత్రపర్వంగా ఊరేగించారు. సర్వాలంకర రూపంలో ఉన్న అమ్మవారిని దర్శించుకుని భక్తులు పరవశించిపోయారు. మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ పర్యవేక్షణలో మహంకాళి అమ్మవారి జాతర అత్యంత కన్నులపండువగా ప్రశాంతంగా ముగిసింది. ఉత్సవాల సందర్భంగా అన్ని విభాగాల అధికారులను సమన్వయం చేస్తూ.. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా అమ్మవారి వేషధారణలో కళాకారులు నృత్యాలు చేస్తూ.. ఊరేగింపులో పాల్గొన్నారు. పోతరాజులు, శివసత్తుల నృత్యాలతో ఆలయ ప్రాంగణమంతా భక్తిప్రపత్తులతో మార్మోగింది.
బోనాల చెక్కులు పంపిణీ
దేవాదాయ శాఖ పరిధిలోకి రాని స్థానికులు నిర్వహించే దేవాలయాలకు కూడా ఆర్థిక సాయం అందజేస్తున్న ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. ఆషాఢ మాస బోనాల ఉత్సవాల కోసం తెలంగాణ ప్రభుత్వం అందజేస్తున్న ఆర్థిక సాయంలో భాగంగా కార్వాన్ నియోజకవర్గంలోని అమ్మవారి ఆలయాల నిర్వాహకులకు సోమవారం గుడిమల్కాపూర్‌లోని జాంసింగ్ వేంకటేశ్వరస్వామి దేవాలయంలో తలసాని శ్రీనివాస్ యాదవ్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సుమారు 3500 ఆలయాలకు బోనాల ఉత్సవాల నిర్వహణ కోసం ప్రభుత్వం 15 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసిందన్నారు. కార్వాన్ నియోజకవర్గంతో పాటు పాత నగరంలోని 358 దేవాలయాల్లో బోనాల నిర్వహణ కోసం మొత్తం 2.13 కోట్ల రూపాయల చెక్కులు అందజేశారు. కార్వాన్ నియోజకవర్గ ఇన్చార్జి జీవన్ సింగ్, మాజీ కార్పొరేటర్లు బంగారి ప్రకాశ్, మిత్రకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
చాంద్రాయణగుట్ట: దేశంలో ఎక్కడా లేని విధంగా దేవాలయాలకు ఆర్థిక సహాయం అందజేయడం ఒక్క సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బోనాల ఉత్సవాల సందర్భంగా గౌలిపురా మాతేశ్వరీ భారతమాత, కోటమైసమ్మ దేవాలయం ప్రాంగణంలో ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ తరఫున ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అమ్మవారి దేవాలయాల కమిటీ సభ్యులకు చెక్కులను అందజేశారు.
మెల్బోర్న్లో అంబరాన్నంటిన బోనాలు
మెల్బోర్న్లో ఆషాఢ బోనాలు వైభవాలు జరిగాయి. ఆస్ట్రేలియాలో స్థిరపడిన తెలంగాణ బిడ్డలు ఒక చోటకు చేరి బోనాల ఉత్సవాలను ఘనంగా జరుపుకొన్నారు. వేముల రాజు, దీపక్, తెలంగాణ మధు ఆధ్వర్యంలో మెల్బోర్న్ తెలంగాణ బోనాల పేరిట
ఉత్సవాలు జరిగాయి.
వైభవంగా..
ఫలహారం బండి ఊరేగింపు కార్యక్రమం వైభవంగా జరిగింది. ఆదయ్యనగర్ కమాన్ నుంచి ప్రారంభమైన ఫలహారం బండి ఊరేగింపులో మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, సత్యవతి రాథోడ్, శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్, ఎమ్మెల్యే ముఠా గోపాల్, బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ గజ్జెల నాగేశ్ పాల్గొన్నారు.
చల్లగా చూసే బాధ్యత నాది: రంగంలో స్వర్ణలత భవిష్యవాణి
రంగం కార్యక్రమంలో ‘ముక్కోటి దేవతలను తలుస్తూ.. స్వర్ణలత భవిష్యవాణిని వినిపించారు. ఆలయ ప్రాంగణంలోని మాతంగేశ్వరి అమ్మవారి వద్ద భవిష్యవాణిని వెల్లడించారు. భక్తులు చేసిన పూజలతో తాను సంతోషంగా ఉన్నానని, ప్రజలను కాపాడి చల్లగా చూసే బాధ్యత తనదేనని పేర్కొన్నారు. ఐదు వారాలపాటు తనను ముతైదువులందరూ భక్తిశ్రద్ధలతో కొలవాలని సూచించారు. వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని, ఐదు వారాలు తనకు సాకపోయాలన్నారు. ఆలస్యమైనా వర్షాలు తప్పనిసరిగా పడుతాయని చెప్పారు. ప్రజలు ఎలాంటి భయాందోళన చెందొద్దని చెప్పారు. గడప, గడపనూ కాపాడే భారం తనపై ఉందన్నారు. రంగం కార్యక్రమం మంత్రి తలసాని పర్యవేక్షణలో జరుగగా, సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతరలో కీలక ఘట్టమైన రంగం కార్యక్రమానికి భారీగా భక్తులు తరలివచ్చి భవిష్యవాణిని ఆలకించారు. కాగా, ఆలయ పాలకమండలి, పోలీసు అధికారులతో ఎప్పటికప్పుడు సమన్వయం చేస్తూ.. మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ఉత్సవాలను పర్యవేక్షించారు.