‘ఎన్నిక ఏదైనా ఎగిరేది గులాబీ జెండానే.. మళ్లీ వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే..’అని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్ విశ్వాసం వ్యక్తం చేశారు. కేంద్రం చేపడుతున్న సర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ప్రక్రియపై అప్రమత్తంగా ఉండాలని బీఆర్ఎస్ నేతలు, శ్రేణులకు సూచించారు. పార్టీ తరఫున నియమించిన బీఎల్ఏలు శ్రేణులకు అవగాహన కల్పించాలని కోరారు. – హైదరాబాద్, జూన్ 6 (నమస్తేతెలంగాణ)
శనివారం తెలంగాణ భవన్లో ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ అధ్యక్షతన ఖైరతాబాద్ నియోజ కవర్గ బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతల సమావేశం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా తలసాని శ్రీనివాస్ యాదవ్ హాజరయ్యారు. సర్‌లో ఓట్ల నమోదు, తొలగింపు, సభ్యత్వ నమోదు, పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..పార్టీ సభ్యత్వ నమోదుపై ప్రత్యేక దృష్టిపెట్టాలని కోరారు. ప్రజలతో మమేకమై సమస్యల పరిష్కారానికి కృషిచేయాలని నిర్దేశించారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టా లని సూచించారు.
పథకాలు, ఇచ్చిన హామీల అమలుకోసం ఒత్తిడి తేవాలన్నారు. ఈ నెల 14న నిర్వహించనున్న ఖైరతాబాద్ నియోజకవర్గస్థాయి సమావేశాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. పార్టీ బలోపేతానికి చిత్తశుద్ధితో కష్టపడ్డ కార్యకర్తలకు తగిన గౌరవం, గుర్తింపు ఉంటుందని తలసాని స్పష్టం చేశారు. కష్టనష్టాల్లో అండగా ఉంటామని భరోసానిచ్చారు. తెలం గాణ సాధన పోరాటం నుంచి రాష్ట్ర అభివృద్ధిలో కేసీఆర్ పాత్ర కీలకమని వ్యాఖ్యానించారు. పదేళ్ల పాలనలో అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో దేశానికి ఆదర్శంగా నిలిపారని గుర్తుచేశారు. గులాబీ జెండా పార్టీ శ్రేణుల్లో ఆత్మగౌరవాన్ని ఇనుమడింపజేసిందని చెప్పారు. పార్టీని వీడి వెళ్లిపోయిన వారిని తిరిగి ఎట్టిపరిస్థితుల్లో చేర్చుకోబోమని స్పష్టం చేశారు. క్రమశిక్షణను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
అబద్ధాలకు కేరాఫ్ రేవంత్‌రెడ్డి..
కాంగ్రెస్ పార్టీ మోసాలు, అబద్ధాలకు ప్రతీకగా మారిందని విరుచుకుపడ్డారు. ఎన్నికల ముందు అనేక హామీలిచ్చి రెండున్నరేళ్లు దాటినా అమలులో విఫలమైందని మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అబద్ధాలతో కాలయాపన చేస్తున్నారని ధ్వజమెత్తారు. హామీల అమలు కోసం ప్రశ్నిస్తే అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని దుయ్యబట్టారు. కేసీఆర్ పాలనలో అప్పులు తెచ్చి అభివృద్ధి చేస్తే..రేవంత్ మాత్రం అప్పులు చేసి కమీషన్ల రూపంలో దిగమింగుతున్నారని విమర్శించారు.
కాంగ్రెస్ పాలనలో విసిగిపోయిన తెలంగాణ ప్రజలు ‘కాంగ్రెస్ పోవాలి.. కేసీఆర్ తిరిగి రావాలి..’ అని కోరుకుంటున్నారని గుర్తుచేశారు. ఈ సమావేశంలో ఖైరతాబాద్ నియోజవర్గ సీనియర్ నేతలు మన్నె గోవర్ధన్‌రెడ్డి, జూబ్లీహిల్స్ డివిజన్ మాజీ కార్పొరేటర్ వెల్డండ వెంకటేశ్, సోమాజిగూడ ఇన్చార్జి మహేశ్‌యాదవ్, మాజీ ల్రైబరీ చైర్పర్సన్ ప్రసన్న, డివిజన్ అధ్యక్షుడు ఆనంద్, హిమాయత్‌నగర్ డివిజన్ ఇన్చార్జి బాబుయాదవ్, మాజీ కార్పొరేటర్ హేమలత తదితరులు పాల్గొన్నారు.