బేగంపేట్ ఏప్రిల్ 25 : ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తున్న పాకిస్తాన్ పై కేంద్ర ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకోవాలని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ డిమాండ్ చేశారు పహల్గాం లో పర్యాటకులపై ఉగ్రవాదుల దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. సికింద్రాబాద్ బేగంపేట్ పరిధిలోని పీజీ రోడ్డులో నిర్వహించిన క్యాండిల్ ర్యాలీలో ఎమ్మెల్యే తలసాని పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పహల్గాం ఘటన దేశం మొత్తాన్ని దిగ్భా్రంతికి గురి చేసిందన్నారు. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదం వల్లనే అనేకమంది ప్రాణాలు బలి అవుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాదాన్ని తుదముట్టించాలన్నారు. భారత్ వైపు చూడాలంటేనే భయపడేలా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
కుత్బుల్లాపూర్: పహల్గం ఉగ్రదాడిని ఖండిస్తూ శుక్రవారం రాత్రి చింతల్ మెయిన్ రోడ్డులో బీఆర్ఎస్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన శాంతి ర్యాలీలో బీఆర్ఎస్ పార్టీ విప్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ పాల్గొని మృతులకు నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి నిత్యం శాంతి జపాన్ని పటించే భారత్ ను ఇలాంటి కవ్వింపు చర్యలతో అధైర్య పరచలేరని, ఇలాంటి విద్వేషాలను రెచ్చగొట్టే వారిపై ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరించాలన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్వీ కుత్బుల్లాపూర్ అధ్యక్షుడు అఖిల్, ఉపాధ్యక్షులు ప్రవీణ్ నాయక్, దినేశ్, వినయ్ నాయక్, గుబ్బల తేజ, విశేశ్ నాయుడు, హనీఫ్, అనిల్, కృష్ణ, నవీన్, రతన్ సింగ్, రవి కిరణ్, దిలీప్ గౌడ్, రాజేశ్ పాల్గొన్నారు.