తెలంగాణలో భోగి పండుగ రోజున జర్నలిస్టుల అరెస్టులు పెనుదుమారం రేపాయి. అర్ధరాత్రి వేళ ఏ ఉగ్రవాదినో అరెస్ట్ చేసినట్లుగా జర్నలిస్టులను అరెస్ట్ చేయడమేంటంటూ ప్రజాసంఘాలు, వివిధ పార్టీల నాయకులు పోలీసుల చర్యను తప్పుబట్టాయి. ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ ఎన్టీవీలో ప్రసారమైన వార్తకు సంబంధించి విచారిస్తామంటూ ఛానల్లో పనిచేస్తున్న జర్నలిస్టులను ఎలా ఉంటే అలాగే ఎక్కడ ఉంటే అక్కడి నుంచే పోలీసులు తీసుకెళ్లడంపై విమర్శలు వెల్లువెత్తాయి. సీసీఎస్ పోలీసులు నాటకీయ పరిణామాల మధ్య మంగళవారం అర్ధరాత్రి ఎన్టీవీలో పనిచేస్తున్న తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ దొంతురమేశ్, సీనియర్ రిపోర్టర్ పరిపూర్ణాచారి, దళిత జర్నలిస్ట్ సుధీర్‌ను అరెస్ట్ చేశారు.
సిటీబ్యూరో, జనవరి 14(నమస్తే తెలంగాణ) : ఇటీవల ఐఏఎస్‌ల ప్రతిష్టకు భంగం కలిగించేలా ఎన్టీవీ వార్తా ఛానల్ ద్వారా కథనం ప్రసారం చేశారంటూ ఐఏఎస్ అధికారుల సంఘం కార్యదర్శి జయేశ్‌రంజన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు బీఎన్ఎస్ 75,78,79,351(1), 352(2) సెక్షన్ల కింద ఈనెల 10వ తేదీన సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి సీపీ సజ్జనార్ నేతృత్వంలో ఎనిమిది మంది సభ్యులతో సిట్ ఏర్పాటు చేశారు. సిట్ ఆదేశాల మేరకు ఈ కేసు విషయంలో విచారించాలని ఎన్టీవీకి చెందిన ముగ్గురు రిపోర్టర్లను అర్థరాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తెల్లవారితే భోగి పండుగ నేపథ్యంలో పండుగ సెలబ్రేషన్స్ కోసం బ్యాంకాక్‌కు కుటుంబ సభ్యులతో కలిసి వెళ్తుండగా శంషాబాద్ ఎయిర్‌పోర్టులో దొంతురమేశ్ను పోలీసులు అరెస్ట్ చేశారు.
తాము విచారణకు రమ్మంటే రాకుండా పారిపోతున్నారంటూ ఆయనను వెంట తీసుకెళ్లి పోలీసు వాహనంలో ఎక్కించారు. అయితే తనను ఎక్కడికి తీసుకెళ్తున్నారని అడిగిన రమేశ్‌కు ఏమీ సమాధానం చెప్పకుండానే తమతో వచ్చేయాలంటూ చెప్పిన పోలీసులు బషీర్‌బాగ్ సీసీఎస్‌కు తరలించారు. అదే సమయానికి పరిపూర్ణచారిని, సుధీర్‌ను వారివారి ఇళ్ల నుంచి ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం అర్థరాత్రి నుంచి బుధవారం సాయంత్రం వరకు సుమారు 15 గంటల విచారణ తర్వాత వారిలో పరిపూర్ణచారిని వదిలిపెట్టగా మిగతా ఇద్దరిని కింగ్‌కోఠి ఆస్పత్రిలో వైద్యపరీక్షలు నిర్వహించి అనంతరం మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు.
ఖండించిన జర్నలిస్టు సంఘాలు, పార్టీలు
జర్నలిస్టుల అరెస్ట్‌ను ప్రజాసంఘాలు, జర్నలిస్టు సంఘాలు, ప్రతిపక్ష పార్టీలతో పాటు అధికారపార్టీలోని కొందరు ప్రజాప్రతినిధులు ముక్తకంఠంతో ఖండించారు. ఎలాంటి నోటీస్ లేకుండా సరైన ప్రొసీజర్ పాటించకుండా జర్నలిస్టులను ఉగ్రవాదుల మాదిరిగా అరెస్ట్ చేయడమేంటని బీఆర్ఎస్ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు ఎన్టీవీ ఆఫీసులో పోలీసులు సోదాలు నిర్వహించారు. రెండు సార్లు వచ్చిన పోలీసులు ఎలాంటి సెర్చ్ వారెంట్ లేకుండా వచ్చి డెస్క్ జర్నలిస్టులను బెదిరిస్తూ అన్ని సిస్టమ్‌లను, సర్వర్రూమ్ను సీజ్ చేస్తామని దబాయించారు. దీంతో వారంతా సెర్చ్ వారెంట్ ఎక్కడంటూ ప్రశ్నించగానే వెళ్లిపోయి మళ్లీ వచ్చిన సీసీఎస్ పోలీసులు ఒక రిక్వెస్ట్ లెటర్ రాసి న్యూస్ రూమ్‌తో సహా అన్ని విభాగాలు చెక్ చేశారు. అనంతరం ఒక సీపీయూను తీసుకెళ్లినట్లు ఎన్టీవీ బృందం తెలిపింది.