తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ నిర్లక్ష్యం, కొందరు డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారుల అవినీతి, పర్యవేక్షణా లోపంతో రాష్ట్రంలో జోరుగా గడువు తీరిన మందులు, సర్జికల్స్ చెలామణి అవుతున్నాయి. ధనార్జనే ధ్యేయంగా కొన్ని ఫార్మా డీలర్స్, డిస్ట్రిబ్యూషన్ ఏజెన్సీలు కాలం చెల్లిన ఔషధాలు, సర్జికల్, నాసిరకం మందులను మార్కెట్లోకి సరఫరా చేస్తూ రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. దేశంలోని ఇతర రాష్ర్టాలకు చెందిన ప్రభుత్వ దవాఖానలకు సరఫరా చేసే ‘నాట్ ఫర్ సేల్’ మందులను తక్కువ ధరకు కొనుగోలు చేసి వాటిపై ఉన్న లేబుళ్లను మార్చివేసి రాష్ట్రంలోని పలు ప్రభుత్వ, కార్పొరేట్ దవాఖానలతో పాటు మెడికల్ షాపులకు, ఇతర రాష్ర్టాలతో పాటు విదేశాలకు సైతం సరఫరా చేస్తున్నా వైద్య, ఆరోగ్యశాఖకు, డీసీఏకు గాని సోయిలేకపోవడం గమనార్హం.
– సిటీబ్యూరో, డిసెంబర్ 31 (నమస్తే తెలంగాణ)
సికింద్రాబాద్, కంటోన్మెంట్ ప్రాంతంలోని ‘స్వస్థ్య ఫార్మా సర్జికల్ కంపెనీ, ‘ఎన్హైవ్ హెల్త్‌కేర్’ కంపెనీలు గడువు తీరిన మందులను రాష్ట్రంలోని పలు కార్పొరేట్ దవాఖానలతో పాటు ప్రభుత్వ రంగ దవాఖానలు, మెడికల్ షాపులకు సైతం సరఫరా చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ కంపెనీలు గడువు తీరిన మందులు, ‘నాట్ ఫర్ సేల్’ మందులను మార్కెట్ రేట్ల కంటే తక్కువ ధరలకు సరఫరా చేస్తూ సొమ్ము చేసుకుంటున్నట్లు ఇటీవల అదే కంపెనీకి చెందిన పలువురు ఉద్యోగులు డ్రగ్ కంట్రోల్ అధికారులతో పాటు కార్ఖాన పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఈ వ్యవహారంపై ముందుగా స్పందించాల్సిన సికింద్రాబాద్ డ్రగ్ ఇన్స్పెక్టర్ ఏమాత్రం స్పందించకుండా ముఖం చాటేయగా, పోలీసులు తూతూ మంత్రంగా కేసు నమోదు చేసినట్లు ఫిర్యాదు దారులు ఆరోపిస్తున్నారు. ఫిర్యాదుదారుల కథనం ప్రకారం…బిహార్‌కు చెందిన సోనుకుమార్ బ్రతుకుదెరువు కోసం కొన్ని సంవత్సరాల క్రితం నగరానికి వలస వచ్చి మచ్చబొల్లారంలో స్థిరపడ్డాడు. ఇతడు చాలా కాలం సింగాపూర్‌కు చెందిన ‘మాన్లీకె’ కంపెనీలోని మార్కెటింగ్ విభాగంలో పనిచేశాడు. ఔషధాల మార్కెటింగ్‌లో మంచి అనుభవం ఉండడంతో తానే స్వయంగా మందులు సరఫరా చేసే డీలర్షిప్ నిర్వహించాలని నిర్ణయించుకున్నాడు. అయితే మార్కెటింగ్ ద్వారా పరిచయమైన నగరంలోని ఒక కార్పొరేట్ దవాఖానలో ప్లాస్టిక్ సర్జన్‌గా పనిచేసే ఒక వైద్యుడికి విషయాన్ని చెప్పాడు. దీంతో సదరు వైద్యుడు పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చాడు. ఈ క్రమంలో వైద్యుడి భార్య జమ్మల శృతితో పాటు సోనుకుమార్ భార్య లలసాదేవిలు డైరెక్టర్లుగా వ్యవహరిస్తూ సికింద్రాబాద్, కంటోన్మెంట్ ప్రాంతంలో ‘స్వస్థ్య ఫార్మా సర్జికల్ కంపెనీ’, ‘ఎన్హైవ్ హెల్త్‌కేర్’ పేర్లతో రెండు ఫార్మ డీలర్ కంపెనీలను స్థాపించారు. ఈ కంపెనీల ద్వారా నగరంలోని పలు కార్పొరేట్ దవాఖానలు, ప్రభుత్వ రంగ దవాఖానలు, ఇతర డీలర్స్కు పెద్ద ఎత్తున మందులు, సర్జికల్స్‌ను సరఫరా చేస్తున్నారు.
సింగపూర్‌లోని ఫిన్‌ల్యాండ్‌కు చెందిన ‘మాన్లికె’ అనే ఫార్మ కంపెనీ వివిధ రకాల ఔషధాలు, సర్జికల్స్‌ను ఢిల్లీలోని ‘పారెక్’ అనే ప్రధాన డీలర్ కంపెనీకి సరఫరా అవుతాయి. అనంతరం ఈ మందులను సదరు కంపెనీ దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న సబ్ డీలర్లకు సరఫరా అవుతాయి. ఈ క్రమంలో సికింద్రాబాద్‌లోని ‘స్వస్థ్య ఫార్మా సర్జికల్’ అనే డీలర్ కంపెనీ ఢిల్లీ, రాజస్థాన్‌లోని పారెక్ అనే ప్రధాన డీలర్ కంపెనీ నుంచి ఔషధాలను కొనుగోలు చేసి వివిద ప్రాంతాల్లో ఉన్న పలు కార్పొరేట్ హాస్పిటల్స్, ఇతర చిన్న చిన్న డీలర్స్కు సరఫరా చేస్తుంది. ఇదిలా ఉండగా అధిక లాభాలను ఆర్జించాలనే దురాశతో నిర్వాహకులు గడువు తీరిన మందులను వాటిపై ఉన్న లేబుల్స్ మార్చివేసి నగరంలోని పలు కార్పొరేట్ దవాఖానలు, ప్రభుత్వ రంగ దవాఖానలతో పాటు మెడికల్ షాపులకు సరఫరా చేస్తున్నట్లు స్వయాన ఆ కంపెనీలో పనిచేసే ఉద్యోగులే పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఔషద తయారీ కంపెనీల నుంచి నేరుగా ప్రభుత్వ దవాఖానలకు అతి తక్కువ ధరలకే శాంపిల్ మందులను సరఫరా చేస్తారు. అందుకే ఆ మందులను బయట ఎక్కడ కూడా అమ్మకూడదని వాటిపై ‘నాట్ ఫర్ సేల్’అనే లేబుల్ అతికిస్తారు. అయితే స్వస్థ్య ఫార్మా డీలర్ కంపెనీ నిర్వాహకులు ఆయా ప్రభుత్వ దవాఖానల నుంచి దొడ్డి దారిన అతి తక్కువ ధరలకే ఔషదాలు, సర్జికల్స్‌ను కొనుగోలు చేసి, మార్కెట్ కంటే కూడా తక్కువ ధరలకే విక్రయిస్తారు.
గడువు తీరిన మందులపై కొత్త తేదీలతో కూడిన స్టిక్కర్లను అంటించి మార్కెట్లోకి సరఫరా చేస్తారు. అందుకోసం సికింద్రాబాద్‌లోని స్వప్నలోక్ కాంప్లెక్స్ దగ్గర జహంగీర్ అనే వ్యక్తి వద్ద కొత్త తేదీలతో కూడిన స్టిక్కర్లను ప్రింట్ చేయిస్తాడు. ఆ స్టిక్కర్లను గడువు తీరిన ఔషధాలపై అంటించి మార్కెట్లో సరఫరా చేస్తారు. అంతే కాకుండా శాంపిల్ మందులపై కూడా నాట్ ఫర్ సేల్ కనిపించకుండా ఆ లేబుల్‌పై స్టిక్కర్లను అంటించి సరఫరా చేస్తున్నట్లు సొంత కంపెనీ ఉద్యోగులే ఆరోపిస్తున్నారు. అంతే కాకుండా మైసూర్‌లోని ప్రముఖ మెడికల్ కాలేజీకి సైతం ఈ గడువు తీరిన మందులను సరఫరా చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
స్వస్థ్య ఫార్మా కంపెనీపై స్వయాన ఆ సంస్థలో పనిచేసే ఉద్యోగులే ఆధారాలతో సహా ఫిర్యాదు చేసినా డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు స్పంధించడం లేదని ఫిర్యాదు దారులు ఆరోపిస్తున్నారు. ఫిర్యాదు చేసి దాదాపు నెల రోజులు గడుస్తున్నా సంబంధిత అధికారులు కనీస చర్యలు తీసుకున్న పాపాన పోలేదని ఫిర్యాదుదారులు మండిపడుతున్నారు. దీంతో కార్ఖాన పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు న్యాయ నిపుణుల సలహా మేరకు కేసు నమోదు చేసినట్లు ఫిర్యాదుదారులు తెలిపారు.
స్వస్థ్య ఫార్మా వ్యవహారంపై ఆరు నెలల క్రితం టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు కూడా చేశారు. అయితే దాడులు జరిపిన పోలీసులు ఎలాంటి కేసు నమోదు చేయకుండా వదిలేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. పోలీసుల దాడుల తరువాత కూడా యథేచ్ఛగా దో నంబర్ దందా కొనసాగుతున్నట్లు ఫిర్యాదుదారుడు వినయ్ ఆరోపించాడు. రాజస్థాన్, ఢిల్లీ రాష్ట్రాల నుంచి వచ్చే ఈ గడువు తీరిన సర్జికల్ మందులను సోనూకుమార్ తన నివాసంలో నిల్వ చేస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా గడువు తీరిన మందులు, శాంపిల్ మందులను మార్కెట్లోకి సరఫరా చేయడంలో డీలర్షిప్ కంపెనీకి పెట్టబడి పెట్టిన వైద్యుడే కీలక పాత్ర పోషిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.