దుండిగల్, ఆగస్టు 16: అక్రమాలకు తావిచ్చిందెవరు? సాధారణ ప్రజల్లో ఆశలు రేకెత్తించి, సక్రమాలకు తిలోదకాలిచ్చి దుర్మార్గం వైపు నడిపించిందెవరు? ఈ పాపానికి ఒడిగట్టిందెవరు? కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలో ఇబ్బడిముబ్బడిగా వెలుస్తున్న అక్రమ నిర్మాణాలకు బాధ్యులు ఎవరు? అధికారులు నిజాయితీగా పనిచేస్తే అసలు అక్రమాలు జరుగుతాయా? అనే ప్రశ్నలు స్థానిక సామాన్య ప్రజలల్లోనూ ఉత్పన్నమవుతున్నాయి. ఒకటేమిటి అన్ని విభాగాలల్లోనూ అవినీతి రాజ్యమేలుతుందనడానికి నిన్న బాచుపల్లిలోని ఎర్రకుంటలో కూల్చిన నిర్మాణమే సాక్ష్యంగా నిలుస్తుందంటున్నారు స్థానికులు
ఒక సాధారణ వ్యక్తి సక్రమంగా ఇల్లు కడితేనే రాబందుల్లా వాలిపోయే అధికారులు, ఏకంగా ఎర్రకుంట చెరువులోని ఎఫ్టీఎల్, బఫర్ జోన్లో నిర్మాణం సాగిస్తుంటే ఎందుకు అడ్డుకోకుండా ఉంటారా? హైడ్రా అధికారులకు ఉన్న సమాచారం స్థానిక రెవెన్యూ, ఇరిగేషన్ మున్సిపాలిటీ అధికారులకు లేదా? అయినా చెరువు ఎఫ్టీఎల్ (ఫుల్ట్యాంక్ లెవల్)లో నిర్మాణాలకు హెచ్ఎండీఏ అధికారులు ఎలా అనుమతి ఇస్తున్నారనే ప్రశ్నలు వెలువడుతున్నాయి.
కేవలం తమకు అందాల్సిన వాటా అందితే చాలు ఎక్కడైనా అనుమతులు ఇస్తామనే రీతిలో అధికారులు ఉండటం చేతనే ఇటువంటి అక్రమాలు చోటుచేసుకుంటున్నాయని స్థానికులు చెబుకుంటున్నారు. అసలు ఎర్రకుంట చెరువు ఎఫ్టీఎల్/ బఫర్ జోన్‌ను పక్కకు తప్పించిన స్థానిక రెవెన్యూ యంత్రాంగం ఎన్వోసీ ఇవ్వడంతోనే అసలు కథమొదలైందని తెలుస్తుంది. చెరువు ఎఫ్టీఎల్/బఫర్‌ను పక్క సర్వే నంబర్లల్లో చూపించి నిర్మాణదారులు రెవెన్యూ స్కెచ్ పొందారని, దానికి ఇరిగేషన్ అధికారులు సైతం వంత పాడటంతోనే సుమారు వేయి గజాల స్థలంలో మూడు బ్లాకులు ఐదంతస్థుల చొప్పున వెలిసినట్లు స్థానికులు చర్చించుకుంటున్నారు.
మొదటి నుంచి ఈ నిర్మాణాలపై ఫిర్యాదులు అందుతున్నా అటు హెచ్ఎండీఏ గాని ఇక్కడి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు గానీ గుడ్డిగా వ్యవహరించడం వెనుక పెద్ద మొత్తంలో ఆమ్యామ్యాలు చేతులు మారినట్లు సర్వత్రా ఆరోపణలు వినిపిస్తున్నాయి. బఫర్ జోన్/ ఎఫ్టీఎల్ పరిధిలో జరుతున్న నిర్మాణాలను సంబంధిత అధికారులు ఆదిలోనే అడ్డుకుంటే ఇప్పుడీ నష్టం జరిగేది కాదు కదా..! అనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఈ పాపంలో రెవెన్యూ, ఇరిగేషన్, లోకల్ బాడీ, హెచ్ఎండీఏ సహకారం లేకుంటే నిర్మాణాలు ఇంతవరకు వచ్చేవా? అంటూ స్థానికులు అధికారుల తీరును ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనా అవినీతికి పాల్పడే అధికారులపై విచారణ జరుపాలనే డిమాండ్ సర్వత్రా వినిపిస్తుంది.