మేడ్చల్, డిసెంబర్28(నమస్తే తెలంగాణ): రేషన్ కార్డుల దరఖాస్తుదారుల్లో అయోమయం నెలకొంది. వచ్చే సంక్రాంతి నుంచి రేషన్ కార్డుల కోసం కొత్త దరఖాస్తులు స్వీకరణ కార్యక్రమం నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ప్రజాపాలనలో రేషన్ కార్డుల కోసం ఇచ్చిన దరఖాస్తుల పరిస్థితి ఏమిటని అర్జీదారులు ఆందోళన చెందుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజాపాలనలో వివిధ పథకాల కోసం తీసుకున్న దరఖాస్తులతో పాటు రేషన్ కార్డుల కోసం దరఖాస్తులను ప్రభుత్వం స్వీకరించిన విషయం తెలిసిందే.
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా రేషన్ కార్డుల కోసం 1, 22 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ప్రజాపాలనలో స్వీకరించిన దరఖాస్తులకు ఏడాది పూర్తయిన ఇప్పటి వరకు కార్డుల మంజూరికి ఎలాంటి చర్యలు తీసుకోలేదని దరఖాస్తుదారులు ఆరోపిస్తున్నారు. అయితే కొత్త రేషన్ కార్డులను వచ్చే సంక్రాంతి తర్వాత మంజూరు చేస్తామని చెబుతూనే మరోసారి కొత్త వారి నుంచి దరఖాస్తుల స్వీకరణకు అవకాశం కల్పిస్తున్నట్లు ప్రభుత్వ ప్రకటన మేరకు ఏడాది కిందట చేసిన దరఖాస్తులకే దిక్కులేదని, కొత్త వారికి రేషన్ కార్డులు అందిస్తారా అన్న అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.
కార్డు లేకపోవడంతో..
రేషన్ కార్డుల జారీపై ప్రభుత్వానికి స్పష్టత లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. రేషన్ సరకులతో పాటు ప్రభుత్వ పథకాలను రేషన్ కార్డులను ప్రమాణికంగా తీసుకోవడంతో పేద, మధ్య తరగతి ప్రజలు రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు చేసుకున్నారు. రేషన్ కార్డులు జారీ కాకపోవడంతో రేషన్ కార్డుతో వచ్చే ఆరోగ్యశ్రీ సేవలను పొందలేకపోతున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందలేక పోతున్నట్లు ఆవేదన చెందుతున్నారు. దరఖాస్తులు చేసి ఏడాది పూర్తయినా..రేషన్ కార్డుల కోసం నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆందోళన చెందుతున్నారు.
పేద, మధ్య తరగతి వారికి రేషన్ కార్డులు లేకపోవడంతో అన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్నట్లు పేర్కొంటున్నారు. ఇప్పటికైతే ప్రభుత్వం నుంచి అధికారులకు రేషన్ కార్డుల మంజూరికి ఎలాంటి మార్గదర్శకాలు రాలేవని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఈ ప్రక్రియ కోసం అవసరమైన మార్గదర్శకాలు వచ్చిన వెంటనే చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నా..కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్ కార్డులు అందించడంలో కావాలనే కాలయాపన చేస్తున్నట్లు దరఖాస్తుదారులు ఆరోపిస్తున్నారు. తిరిగి కొత్త వారికి రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరిస్తామని ప్రభుత్వ ప్రకటనతో మరింత కాలయాపన చేసేందుకే ఇలాంటి ప్రకటన చేసినట్లు చెప్పుకుంటున్నారు. ప్రజాపాలనలో దరఖాస్తులు ఇచ్చిన వారికి రేషన్ కార్డులు అందిస్తూనే కొత్త వారికి రేషన్ కార్డులు అందించాలని దరఖాస్తుదారులు కోరుతున్నారు.