దుండిగల్, జూన్22: సులభంగా డబ్బు సంపాదించాలనే లక్ష్యంతో నకిలీ కరెన్సీని కమీషన్ పద్ధతిపై మార్చేందుకు ప్రయత్నిస్తున్న ఓ వ్యక్తిని బాచుపల్లి పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నిందితుడి నుంచి రూ.15 లక్షల విలువచేసే నకిలీ కరెన్సీని(500 రూపాయల నోట్లు) స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఏపీ, తూర్పుగోదావరి జిల్లా, రాజమండ్రికి చెందిన పత్తిపాటి ప్రేమ్ చంద్(28)కు, మహారాష్ట్ర పూణెకు చెందిన రాకేశ్‌తో పరిచయం ఉంది.
సులభంగా డబ్బు సంపాదించాలనే మార్గం కోసం వెతుకుతున్న ప్రేమ్‌చంద్‌కు దొంగనోట్లు చలామణి చేయాలని రాకేశ్ సూచించాడు. దీనికి పెద్ద మొత్తంలో కమీషన్ లభిస్తుందని తెలపడంతో ప్రేమ్‌చంద్ అంగీకరించాడు. ఈ నేపథ్యంలో ఈనెల 20న పూణె నుంచి రాకేశ్ రూ.15లక్షల నకిలీ కరెన్సీని ఓ బ్యాగులో పెట్టి ప్రైవేట్ బస్సులో పఠాన్‌చెరుకు పార్సిల్ పంపించాడు.
దానిని తీసుకువెళ్లి నిజాంపేట్‌లోని సీఎంఆర్ షాపింగ్ మాల్ సమీపంలో ఓ వ్యక్తికి అందజేయాలని సూచించాడు. కరెన్సీని ఎవరికి అందజేయాలో తానే చెబుతానని చెప్పాడు.దీనికి అంగీకరించిన ప్రేమ్‌చందు ఈనెల 21న మధ్యాహ్నం పటాన్చెరులో పార్సిల్ గా వచ్చిన నకిలీ కరెన్సీ బ్యాగు తీసుకుని నిజాంపేట్‌కు చేరుకున్నాడు. రాకేశ్ చెప్పిన వ్యక్తి కోసం వేచిఉండగా.. అప్పటికే సమాచారం అందుకున్న బాచుపల్లి పోలీసులు ప్రేమ్‌చంద్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి రూ.15లక్షల నకిలీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.