HYDRAA | సిటీబ్యూరో, డిసెంబర్ 11(నమస్తే తెలంగాణ): హైడ్రాకు చెరువుల సర్వే కొత్త తలనొప్పి తెచ్చిపెడుతున్నది. హైదరాబాద్ చుట్టుపక్కల చెరువుల ఆక్రమణలపై హైడ్రా కార్యాలయానికి ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో వాటిపై కమిషనర్ రంగనాథ్ దృష్టిపెట్టారు. చెరువుల వద్ద ఎవరెవరు ఆక్రమణలకు పాల్పడ్డారన్న విషయంపై క్షేత్రస్థాయిలో అధికారులతో విచారణ చేపట్టారు. స్థానికులు ఇచ్చిన ఫిర్యాదును పరిగణనలోకి తీసుకుంటూనే హైడ్రా బృందం చెరువుల వద్ద వాటి హద్దులను అతిక్రమించిన వారిపై చర్యలు తీసుకోవడానికి పూనుకున్నది. ఇదే సమయంలో హైడ్రాకు సర్వే సమస్యలు తలనొప్పిగా మారాయి. ఒకవైపు చెరువుల హద్దులను నిర్ణయించే దిశగా హెచ్ఎండీఏ కసరత్తు చేస్తుండగా.. మరోవైపు చెరువుల ఆక్రమణలపై వస్తున్న ఫిర్యాదులను విచారించడానికి సర్వే చేయాల్సి వస్తున్నది.
స్థానికంగా ఉన్న ఇరిగేషన్, రెవెన్యూ శాఖల సిబ్బందితో సర్వే చేయించాలని హైడ్రా ప్రయత్నించినప్పటికీ చాలా చోట్ల వారి నుంచి కొంత వ్యతిరేకతే వ్యక్తమవుతున్నది. ముఖ్యంగా ఫిర్యాదులొచ్చిన చెరువుల వద్ద ఇప్పటికే హెచ్ఎండీఏ సర్వే కొనసాగుతున్నదని, హద్దులు నిర్ణయించకముందే ఫిర్యాదులపై నిర్ణయం తీసుకోలేమని వారు చెబుతున్నట్లు సమాచారం. ఇటీవల హైడ్రా క్షేత్రస్థాయిలో చెరువుల ఫిర్యాదులపై విచారణకు వెళ్లినప్పుడు ఇదే పరిస్థితి ఎదురైందని తెలిసింది. గ్రామమ్యాప్ల ద్వారా చెరువుల హద్దులు నిర్ణయించాలనుకున్నా.. ప్రస్తుతం ఉన్న చెరువు వైశాల్యం, గతంలో మ్యాప్‌లలో చూపిస్తున్న ఏరియాలలో తేడా ఉండడంతో హైడ్రా అధికారులకు ఏం చేయాలో పాలుపోవడం లేదు. చెరువులకు సంబంధించి నోటిఫికేషన్స్ వస్తున్నాయని, వాటి ద్వారా హద్దుల ఎంపిక పూర్తయితే తాము ఏదైనా నిర్ణయం తీసుకోవచ్చని హైడ్రా అధికారి ఒకరు చెప్పారు.
పెద్దఅంబర్‌పేట పరిధిలోని కుంట్లూరు పెద్ద చెరువు వద్ద హైడ్రా కమిషనర్ రంగనాథ్ పర్యటనలో సర్వేపై చర్చ జరిగింది. ముందురోజు హైడ్రా బృందం ప్రైవేట్ సర్వేయర్‌తో ఎలా సర్వే చేయిస్తారంటూ స్థానికంగా కబ్జాలో ఉన్న వాళ్లు ప్రశ్నించడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పెద్ద చెరువుకు ప్రిలిమినరీ నోటిఫికేషన్ ఇచ్చామని, త్వరలోనే ఫైనల్ నోటిఫికేషన్ ఇచ్చి హద్దులు నిర్ణయించిన తర్వాత అక్రమ నిర్మాణాల సంగతి చూద్దామని.. అయినప్పటికీ చెరువు మధ్యలో రోడ్డెలా వేస్తారంటూ మున్సిపల్ కమిషనర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. థర్డ్ పార్టీ వారు వేశారంటూ చెప్పినప్పుడు వారిపై కేసులు పెట్టాలని, ఒకవేళ వారు చెబుతున్న సర్వే నంబర్లో హద్దులు తేలిన తరవాత మిగతా ప్రాంతంలో నిర్మాణాలు చేసుకుంటే తమకు అభ్యంతరం లేదని చెప్పారు. మంగళవారం సర్వే చేసే క్రమంలో ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు కూడా హడావిడిగా సర్వే చేయడం కరెక్ట్ కాదని చెప్పారు.
హెచ్ఎండీఏ పరిధిలో ఉన్న చెరువుల హద్దుల నిర్ణయం తర్వాతే హైడ్రా ఫిర్యాదులపై ఒక నిర్ణయం తీసుకునేందుకు అవకాశముంటుందని హైడ్రా అధికారి ఒకరు చెప్పారు. చెరువులకు సంబంధించిన ఫిర్యాదుల్లో ఎక్కువగా హద్దుల ఆక్రమణలే ఉండడంతో వాటిపై హడావిడిగా సర్వే చేస్తే రాబోయే రోజుల్లో తాము ఇబ్బంది పడాల్సి వస్తుందని ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు చెబుతున్నారని తెలిసింది. ముఖ్యంగా హద్దుల నిర్ణయంలో అందరి భాగస్వామ్యం అవసరమని, ఆ దిశగా సర్వే జరగకపోతే న్యాయపరమైన చిక్కులు ఎదుర్కొనే అవకాశం ఉంటుందని అధికారులు భయపడుతున్నారు. ఈ విషయంలో రెవెన్యూ, ఇరిగేషన్ సిబ్బంది తమ పరిధిలో ఉన్న చెరువులకు సంబంధించిన మ్యాప్స్ ఇచ్చినప్పటికీ.. హైడ్రా అధికారులు మాత్రం తమ ఫిర్యాదులపై తాజాగా క్షేత్రస్థాయిలో సర్వే చేయమంటున్నారని ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు.
ఇది ఎలా సాధ్యపడుతుందని, ఫిర్యాదుల ఆధారంగా సర్వేలు చేయడం కష్టమంటున్నారు. చెరువుల హద్దుల లెక్క తేలితే ఆక్రమణల లెక్క తేలుతుందని, అప్పటివరకు తాము ఎలాంటి సర్వేలు చేసినా అవి అయోమయంగా మారుతాయి తప్ప ఏమాత్రం ప్రయోజనం ఉండదని వారు పేర్కొన్నారు..ఈ విషయంలో తాము గతంలో చేసిన సర్వే కు సంబంధించిన మ్యాప్స్ తీసుకొని చెరువు పొజిషన్‌ను గుర్తించి దానిని బట్టి హైడ్రా అడుగేయాలని వారు సూచిస్తున్నారు. ప్రస్తుతం హైడ్రా తమ వద్దకు వస్తున్న ఫిర్యాదులను పరిష్కరించడంలో సర్వేలను ఆధారంగా చేసుకుని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. కానీ అప్పటికప్పుడు సర్వేలకు ఇతర శాఖలు మాత్రం ససేమిరా అంటుండడంతో హైడ్రా బృందానికి ఏం చేయాలో పాలుపోవడం లేదు.