బంజారాహిల్స్, జూలై 5: బంజారాహిల్స్ రోడ్ నం.10లోని సుమారు రూ.150 కోట్ల విలువైన జలమండలి స్థలాన్ని కాజేసేందుకు కొందరు ప్రయత్నాలు చేస్తున్న వ్యవహారంపై.. ‘జలమండలి స్థలంలో మళ్లీ తిష్ట’ శీర్షికన శనివారం నమస్తే తెలంగాణ దినపత్రికలో ప్రచురించిన కథనానికి అధికారులు స్పందించారు. విజిలెన్స్ విభాగం అధికారులు సంబంధిత స్థలంలో ప్రత్యేక పికెట్ ఏర్పాటు చేయడంతో పాటు కబ్జాదారులపై పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. షేక్‌పేట మండలం సర్వే నంబర్ 403/పి, టీఎస్ నెంబర్-1/1/1, హెచ్ బ్లాక్, 10వ వార్డు పరిధిలోకి వచ్చే బంజారాహిల్స్ రోడ్ నెం 10లోని బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి ఎదురుగా ఉన్న 5 ఎకరాల ప్రభుత్వ స్థలంలోని 1.20 ఎకరాల స్థలాన్ని జలమండలికి కేటాయించడంతో పాటు పంచనామా చేసి అప్పగించారు.
కాగా ఈ స్థలాన్ని బోగస్ పత్రాలతో కబ్జా చేసేందుకు గతంలోనే పార్థసారథి, అతడి అనుచరులు ప్రయత్నాలు చేశారు. ఈ వ్యవహారంపై గతంలో ‘నమస్తే తెలంగాణ’ వరుస కథనాలు ప్రచురించడంతో.. పార్థసారథి, అతడి అనుచరులపై బంజారాహిల్స్ పోలీసులు 2 నెలల క్రితం క్రిమినల్ కేసు నమోదు చేశారు. ఆ సమయంలో కొన్నాళ్లపాటు జలమండలి విజిలెన్స్ విభాగం సిబ్బంది అక్కడే ఉండి స్థలంలోకి ఎవరూ రాకుండా చూశారు.
అయితే ఇటీవల విజిలెన్స్ బందోబస్తును తొలగించడంతో పార్థసారథికి చెందిన అనుచరులు గురువారం రాత్రి మరోసారి ప్రవేశించడంతో పాటు వేటకుక్కలను, ఆవులను అక్కడ ఉంచారు. కాగా శనివారం ‘నమస్తే తెలంగాణ’ దిన పత్రికలో మరోమారు కథనం రావడంతో అప్రమత్తమైన జలమండలి అధికారులు ఉదయాన్నే అక్కడకు చేరుకుని ప్రైవేట్ వ్యక్తులను పంపించివేశారు. సంబంధిత స్థలంలో ఆక్రమణలకు ప్రయత్నిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలంటూ తట్టిఖానా జలమండలి సెక్షన్ మేనేజర్ రాంబాబు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.