సిటీబ్యూరో, డిసెంబర్ 12(నమస్తే తెలంగాణ): శాంతిభద్రతలకు విఘాతం కలిగించే రౌడీషీటర్లపై నగరంలో పటిష్టమైన నిఘా ఉంటుందని, అదే స్థాయిలో సమాజాన్ని పట్టిపీడిస్తున్న మత్తు మహమ్మారికి మూలమైన డ్రగ్స్ నేరగాళ్లు, పెడ్లర్లపై కూడా నిఘా పెడతామని నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ అన్నారు. డ్రగ్స్ నియంత్రణ చర్యల్లో భాగంగా బంజారాహిల్స్‌లోని టీజీఐసీసీసీలో శుక్రవారం సీపీ సజ్జనార్ అధ్యక్షతన జరిగిన అత్యున్నతస్థాయి సమన్వయ సమావేశంలో ఐబీ, డీఆర్ఐ, ఎన్సీబీ, ఎక్సైజ్, కౌంటర్ ఇంటెలిజెన్స్, ఈగల్, ఎఫ్ఆర్ఆర్ఓ, తదితర కేంద్ర, రాష్ట్ర ఏజెన్సీల అధికారులు పాల్గొన్నారు.
నగరంలో మాదకద్రవ్యాల నెట్‌వర్క్‌కు చెక్‌పెట్టేందుకు హైదరాబాద్ నార్కొటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్‌ను మరింత బలోపేతం చేస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం ఉన్న బృందాలకు అదనం గా మరో నాలుగైదు కొత్త బృందాలను చేరుస్తున్నామని, ఈ బృందాలు క్షేత్రస్థాయిలో సమాచార సేకరణ, నిందితుల అరెస్ట్‌ల్లో కీలకంగా పనిచేస్తాయని తెలిపారు. మాదకద్రవ్యాల నిర్మూలన అనేది ఒక్కరోజుతో ముగిసే ప్రక్రియ కాదని, అది నిరంతర పోరాటమని, ఈ క్రమం లో అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
ఇకపై ప్రతినెలా అన్ని ఏజెన్సీలతో సమన్వయ సమావేశాలు నిర్వహించి కేసుల పురోగతిని సమీక్షిస్తామని, డ్రగ్స్ కట్టడికి అత్యాధునిక సాంకేతికతను ఉపయోగి స్తున్నామన్నారు. పాత కేసులు, నిందితుల కదలికలు, కొత్త నేర పద్ధతులపై ఏజెన్సీలన్నీ ఎప్పటికప్పుడు సమాచారాన్ని మార్పిడి చేసుకోవాలని, డ్రగ్స్ రవాణాకు కొరియర్ సర్వీసులు వేదికగా మారుతున్న నేపథ్యంలో వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సమావేశంలో నిర్ణయించారు. డ్రగ్స్వ్రాణా, వినియోగంలో విదేశీయుల పాత్ర, విమానాశ్రయా ల్లో ప్రయాణికుల సమాచారం ఆధారంగా సంబంధిత ఏజెన్సీలు నిరంతరం సమన్వయం చేసుకుం టూ అనుమానితుల కదలికలపై నిఘా పెట్టడంపై సుదీర్ఘంగా చర్చించారు.
వైద్యం కోసం నగరానికి వచ్చి ఆసుపత్రుల్లో చేరకుండా తిరుగుతున్న విదేశీయుల వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకోవాలని, ఇలాంటి వారి వివరాలను డీఆర్ఐ, ఎఫ్ఆర్ఆర్ఓ అధికారులతో పంచుకుని.. వారిని వెంటనే ట్రాక్ చేసేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సైబరాబాద్ సీపీ అవినాశ్మ హంతి, ఐబీ జాయింట్ డైరెక్టర్ తిరుగణన సంబంధన్, డీఆర్ఐ డిప్యూటీ డైరెక్టర్ గురురాజేశ్, ఎన్సీబీ అసిస్టెంట్ డైరెక్టర్ విష్ణువర్ధన్, ఈగల్ టీమ్ డీఐజీ అభిషేక్ మహంతి, సీఐఎస్ఎఫ్ డీఐజీ మొహంకా, ఎఫ్ఆర్ఆర్ఓ అప్పలనా యుడు, ఇంటెలిజెన్స్ ఎస్పీ భాస్కరన్, డీసీపీలు అపూర్వారావు, గైక్వాడ్ వైభవ్ రఘునాథ్, డీఆర్ఐ అసిస్టెంట్ డైరెక్టర్ అనురాగ్ సింగ్, తెలంగాణ ఆబ్కారీ శాఖ జాయింట్ కమిషనర్ ఖురేషి పాల్గొన్నారు.