ఓటర్ల జాబితా సవరణ(సర్), డిజిటలైజేషన్ ప్రక్రియలో క్షేత్రస్థాయిలో తీవ్ర గందరగోళం కొనసాగుతూనే ఉంది.. ఓ పక సాంకేతిక లోపాలు, సర్వర్ సమస్యలతో డిజిటలైజేషన్ పనులు నత్తనడకన సాగుతుంటే.. మరోపక ఉన్నతాధికారులు మాత్రం బూత్ లెవెల్ అధికారుల (బీఎల్ఓ)పై ఒత్తిడి పెంచుతున్నారు. పనిచేస్తారా.. ఇంటికి వెళ్తారా? అంటూ ఏకంగా విజిలెన్స్ నిఘా పెట్టడం, సస్పెన్షన్ హెచ్చరికలు జారీ చేయడంపై బీఎల్ఓలు తీవ్ర ఆగ్రహం, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లాలలో ఓటర్ల డేటా డిజిటలైజేషన్ ప్రక్రియ అస్తవ్యస్తంగా మారింది. ఈ మూడు జిల్లాల పరిధిలో ఈ ప్రక్రియ ఇప్పటివరకు కనీసం 50 శాతం కూడా దాటకపోవడం గమనార్హం. యాప్స్ సరిగ్గా పని చేయకపోవడం, పలు ప్రాంతాల్లో ఇంటర్నెట్ సిగ్నల్స్ లభించకపోవడంతో క్షేత్రస్థాయిలో సిబ్బంది తలలు పట్టుకుంటున్నారు. టెక్నికల్ సమస్యలను పరిషరించాల్సింది పోయి, ఆలస్యానికి బీఎల్ఓలదే బాధ్యత అన్నట్లుగా విజిలెన్స్ విభాగంతో నిఘా పెట్టించడం ఇప్పుడు కలకలం రేపుతోంది. టార్గెట్లు రీచ్ అవ్వకుంటే విధుల నుంచి సస్పెండ్ చేస్తామని ఉన్నతాధికారులు జారీచేస్తున్న అంతర్గత హెచ్చరికలు సిబ్బందిలో తీవ్ర ఆందోళన నింపుతున్నాయి.
2002 తెచ్చిన తంటా
సర్ ప్రక్రియతో నగరంలోని ప్రజలు రోజుకో సమస్యతో సతమతమవుతున్నారు. ఎన్యూమరేషన్ ఫారాలు ఇంటింటికీ తిరిగి పంపిణీచేయాల్సిన బీఎల్వోలు పోలింగ్ కేంద్రాల్లోనే తిష్టవేస్తున్నారు. చేసేదేమీలేక ఓటర్లే ఫారాలు తీసుకునేందుకు వెళ్లినా కనీసం ఎలా నింపాలో చెప్పడంలేదని ఆవేదన చెందుతున్నారు. దీంతో తామే స్వయంగా ఫారాల్లో వివరాలు నమోదు చేస్తున్నారు. లేదంటే ఎవరైనా తెలిసిన వాళ్లతో నమోదు చేయిస్తున్నారు. అయితే 2002 ప్రామాణికంగా తీసుకోవడంతో ఓటర్లు గందరగోళానికి లోనవుతున్నారు. ఈక్రమంలో 2002లో ఓటు ఉన్నవారికి పెద్దగా సమస్యలు రావడం లేదు. కానీ.. అప్పుడు ఓటు లేనివారికే అసలు సమస్య వస్తున్నది. అప్పట్లో ఓటు లేనివారు తమ బంధువుల వివరాలు నమోదు చేయాల్సి రావడంతో అయోమయానికి గురవుతున్నారు. ఓటరు తండ్రి, తల్లి లేదంటే సంరక్షుల వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. అందులో ‘బంధుత్వం’ అనే కాలమ్ దగ్గర చాలా మంది తికమకపడుతున్నారు. తప్పుగా నమోదు చేస్తున్నారు. ఈ సమస్య వల్లనే ఎన్యుమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ కూడా మందకొడిగా సాగుతున్నట్లు తెలుస్తున్నది.
సహకరించని బీఎల్వోలు..
క్షేత్రస్థాయిలో బీఎల్వోలు ఓటర్లకు సహకరించడం లేదని ఆరోపణలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఫారాలను ఎలా నింపాలో కనీస అవగాహన కల్పించకపోవడంతో బీఎల్వోలపై ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా 2002 కాలమ్‌లోని వివరాలు నమోదు చేయడంలో అయోమయానికి గురవుతున్నారు. బంధువుల వివరాల దగ్గర తండ్రికి బదులు కుమారుడు.. తాతకు బదులు తండ్రి పేర్లను రాస్తున్నారు. తప్పుగా నమోదు చేశామని తెలుసుకుని బీఎల్వోలకు అప్పటికే ఇచ్చిన ఎన్యుమరేషన్ ఫారాలను తప్పులు సరిచేసేందుకు వెనక్కి ఇవ్వమంటున్నారు. కానీ బీఎల్వోలు మాత్రం ఒకసారి ఇచ్చిన ఫారాలను తిరిగి ఇవ్వలేమని తేల్చి చెప్తున్నట్లు వాపోతున్నారు.ఈ క్రమంలో బీఎల్వోలు, ఓటర్ల మధ్య వాగ్వాదం జరుగుతోంది. ఎన్నికల అధికారులు చొరవ తీసుకుని ఇలాంటి సమస్యలు రాకుండా చూడాలని ఓటర్లు కోరుతున్నారు.