సిటీబ్యూరో, జనవరి 16(నమస్తే తెలంగాణ): ఈ సంక్రాంతికి చోరీల నివారణకు సైబరాబాద్ పోలీసు కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర సరికొత్త వ్యూహం అనుసరించారు. దొంగతనాలు చేసి.. వారం రోజుల కిందట జైలు నుంచి విడుదలై.. సైబరాబాద్ పరిధిలో నివాసముంటున్న 110 మందిని గుర్తించారు. వారందరిపై నిఘా పెట్టడంతో పాటు వారి కదలికలను ఎప్పటికప్పుడు గమనించారు. సంక్రాంతి రోజు పెట్రోలింగ్ సిబ్బంది వారి ఇండ్ల వద్దకు వెళ్లి.. ఉన్నారా లేరా అనే విషయాలను తెలుసుకున్నారు. ఈ విధంగా పోలీసులు దొంగల ఇండ్లపై నజర్ పెంచడంతో చోరీలకు చాన్స్ లేకుండాపోయింది.
హాట్స్పాట్స్లు..
ఈ సంక్రాంతి సందర్భంగా సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో దాదాపు 3 వేలకు పైగా పోలీసు సిబ్బంది గస్తీ చేపట్టారు. 240 హాట్స్పాట్స్లను విశ్లేషించుకొని అక్కడ బందోబస్తును నిర్వహించారు. అదే విధంగా సంక్రాంతి చోరీలను నివారించేందుకు అవగాహన కల్పించడంతో చాలా మంది తాళాలు వేసుకొని వెళ్లిన వారు పోలీసులకు ముందస్తు సమాచారం ఇవ్వడంతో అక్కడ పెట్రోలింగ్ సిబ్బంది అదనపు బలగాలతో నిఘా పెట్టారు. మొత్తానికి పోలీసులు కంటి మీద కునుకులేకుండా ప్రజల ఆస్తులు, భద్రత కోసం నిరంతరం పని చేశారు.