Suravaram Pratapa Reddy | తెలుగు యూనివర్సిటీ, మే 28: తెలంగాణ ప్రజలలో సాంస్కృతిక చైతన్యాన్ని నింపిన సామాజిక సాహిత్యకారుడు, తెలంగాణా వైతాళికుడు సురవరం ప్రతాపరెడ్డి అని తెలంగాణ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్ జీ చిన్నారెడ్డి అన్నారు. నాంపల్లిలోని తెలుగు విశ్వవిద్యాలయం ఎన్టీఆర్ కళామందిరంలో బుధవారం సురవరం ప్రతాపరెడ్డి జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వద్యాలయ అధికారిక చిహ్నాన్ని ఆవిష్కరించారు. సురవరం ప్రతాపరెడ్డి కుమారుడు కృష్ణ వర్ధన్ రెడ్డిని ఈ సందర్భంగా ఘనంగా సత్కరించారు. విస్తరణ సేవా విభాగం ఇన్చార్జి రామ్మూర్తి సభను సమన్వయం చేశారు. తెలుగు యూనివర్సిటీ ఉపాధ్యక్షులు ఆచార్య వెలుదండ నిత్యానందరావు, ఉన్నత విద్యా మండలి అధ్యక్షుడు ఆచార్య వీ బాలకృష్ణారెడ్డి, ప్రముఖ రచయిత, చరిత్రకారులు డాక్టర్ సంగిశెట్టి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
చిరస్మరణీయుడు సురువరం
కవాడిగూడ, మే 28: సాహిత్య, సాంస్కృతిక, రాజకీయ రంగాల్లో తెలంగాణను మేల్కొలిపి తెలుగు ప్రజలను జాగృతం చేసిన బహుముఖ ప్రజ్ఞానిధి సురవరం ప్రతాపరెడ్డి అని తెలంగాణ సారస్వత పరిషత్తు అధ్యక్షులు, సురవరం ప్రతాపరెడ్డి సాహిత్య వైజయంతి ట్రస్ట్ అధ్యక్షుడు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి అన్నారు. సురవరం ప్రతాపరెడ్డి జయంతని పురస్కరించుకొని ట్యాంక్‌బండ్‌పై నున్న ఆయన విగ్రహం వద్ద ఆచార్య ఎల్లూరి శివారెడ్డి, ట్రస్ట్ కార్యదర్శి సురవరం పుష్పలత, తెలంగాణ సారస్వత పరిషత్తు కార్యదర్శి, ట్రస్ట్ సంయుక్త కార్యదర్శి జె.చెన్నయ్య, ట్రస్ట్ సభ్యులు, కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ట్రస్టు సభ్యులు డాక్టర్ సురవరం కృష్ణవర్థన్రెడ్డి, కొండా లక్ష్మీకాంత్‌రెడ్డి, సురవరం రఘువర్ధన్‌రెడ్డి, సురవరం విజయభాస్కర్‌రెడ్డి, డాక్టర్ సురవరం రంగారెడ్డి, సురవరం అనిల్‌కుమార్‌రెడ్డి, సురవరం కపిల్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ వైతాళికుడు
హైదరాబాద్, మే 28 (నమస్తే తెలంగాణ): తెలంగాణ వైతాళికుడు సురవరం ప్రతాపరెడ్డి అని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ కొనియాడారు. బుధవారం సురవరం జయంతిని పురస్కరించుకుని సాహితీవేత్తలకు శుభాకాంక్షలు తెలియజేశారు. తెలుగు, హిందీ, ఉర్దూ, సంసృతం, పార్సీ, ఆంగ్ల భాషలలో నిష్ణాతులైన సురవరం ప్రతాపరెడ్డి గోలొండ పత్రికకు అనుబంధంగా భారతి సాహిత్య పత్రిక, ప్రజావాణి పత్రికలను స్థాపించి తెలంగాణ సాంసృతిక చరిత్రలో ఒక అధ్యాయంగా నిలిచారని గుర్తుచేశారు. తెలుగు వర్సిటీకి అధికారికంగా సురవరంప్రతాపరెడ్డి పేరు పెట్టి సాహిత్యవేత్తలను గౌరవించుకున్నామని పేర్కొన్నారు..
బషీర్‌బాగ్ దేశోద్దరక భవనంలో..
రవీంద్రభారతి,మే28: సురవరం ప్రతాపరెడ్డి జయంతిని పురస్కరించుకొని సురవరం ప్రతాపరెడ్డి సాహిత్య వైజయంతి సాహితీ పురస్కారం 2025 ప్రదానోత్సవ కార్యక్రమం బుధవారం సాయంత్రం బషీర్‌బాగ్ దేశోద్దరక భవనంలో జరిగింది. శాంతా వసంతా ట్రస్ట్ సౌజన్యంతో సురవరం ప్రతాపరెడ్డి సాహిత్య వైజయంతి ట్రస్ట్ ఆధ్వర్యంలో సురవరం ప్రతాపరెడ్డి సాహిత్య వైజయంతి ట్రస్ట్ అధ్యక్షుడు డాక్టర్ ఎల్లూరి శివారెడ్డి అధ్యక్షతన జరిగిన పురస్కార ప్రధానోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి శ్రీధర్‌బాబు, విశిష్ట అతిథిగా శాంతా వసంతా ట్రస్ట్ అధ్యక్షుడు డాక్టర్ కేఐ వరప్రసాద్‌రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా 2025 సంవత్సరానికి గాను ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ హనుమాండ్ల భూమయ్య, రచయిత సంగిశెట్టి శ్రీనివాస్‌కు సురవరం ప్రతాపరెడ్డి సాహిత్య వైజయంతి సాహితీ పురస్కారాలను అందజేసి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి, సురవరం పుష్పలత, ట్రస్టు సభ్యులు సురవరం కృష్ణవర్ధన్‌రెడ్డి, సురవరం రఘువర్దన్‌రెడ్డి, సువరం విజయభాస్కర్‌రెడ్డి, సురవం రంగారెడ్డి, సురవం అనిల్‌కుమార్‌రెడ్డి, సురవరం కపిల్ తదితరులు పాల్గొన్నారు.