Street Dogs | సిటీబ్యూరో, ఆగస్టు 12 (నమస్తే తెలంగాణ): ‘ఢిల్లీలోని నేషనల్ క్యాపిటల్ టెరీటరీతో పాటు నోయిడా, గుర్గావ్, ఘజియాబాద్ ప్రాంతాల్లో అన్ని వీధి కుక్కలను ఎనిమిది వారాల్లోగా డాగ్ షెల్టర్లకు తరలించాలి.. ఈ నేపథ్యంలోనే వీధి కుక్కలను అధికారులు తీసుకెళ్లకుండా ఎవరైనా వ్యక్తి లేదా సంస్థ అడ్డుకుంటే వారు చట్టపరమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది’ అని వీధి కుక్కలపై సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు ఇప్పుడు గ్రేటర్లో చర్చనీయాంశంగా మారాయి. చిన్నారులు, వృద్ధులే లక్ష్యంగా వీధి కుక్కలు రెచ్చిపోయి కాట్లు వేసి అమాయకుల ప్రాణాలను బలి తీసుకుంటున్నాయని, వీధి కుక్కలను డాగ్ షెల్టర్లకు శాశ్వతంగా తరలించే కార్యక్రమం చేపట్టాలనే డిమాండ్ నగరవాసుల నుంచి వ్యక్తమవుతున్నది. ఆదే సమయంలో జంతు ప్రేమికులు.. వీధి కుక్కల పట్ల కఠినంగా ఉండొద్దని, కాటు వేసే కుక్కల్ని గుర్తించి రేబిస్ వ్యాక్సిన్ ఇచ్చి సురక్షిత ప్రాంతంలో ఉంచాలంటున్నారు.
ఇటు జనాలు, అటు జంతు ప్రేమికుల మధ్యలో జీహెచ్ఎంసీ ఏ విధంగా వ్యవహరిస్తుందోనన్న ఉత్కంఠ నెలకొంది. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ప్రభుత్వం తరపున న్యాయనిపుణులు అధ్యయనం చేస్తున్నారని ఓ ఉన్నతాధికారి తెలిపారు. కొత్తగా డాగ్ షెల్టర్ జోన్లు పెంచాలన్న డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి. కాగా ప్రస్తుతం జంతు సంరక్షణ కేంద్రాలు మాత్రమే ఉండగా.. సుప్రీంకోర్టు ఆదేశాల ఆమలు చేయాల్సి వస్తే కొత్తగా షెల్టర్ జోన్లు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. జీహెచ్ఎంసీ పరిధిలో 3.79 లక్షల వీధి కుకలుండగా.. వీటిలో 77 శాతం కుకలకు మాత్రమే స్టెరిలైజేషన్ చేస్తున్నట్టు అధికారిక లెకలు చెబుతున్నాయి. ఐదు చోట్ల జంతు సంరక్షణ కేంద్రాలు ఉండగా, రెండు చోట్ల నిర్మాణ దశలో ఉన్నాయి.
స్టెరిలైజేషన్స్, వ్యాక్సినేషన్, అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు ఇతర జంతువుల సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారు. గుంపులు గుంపులుగా తిరుగుతున్న కుక్కలపై ఫిర్యాదులు రాగానే అక్కడి నుంచి పట్టుకెళ్లి డాగ్ షెల్టర్లకు తరలించాక కుటుంబ నియంత్రణ, రేబిస్ వ్యాక్సిన్లు ఇచ్చి మళ్లీ తీసుకువెళ్లిన చోటనే వదిలేస్తున్నారు. జంతు సంరక్షణ చట్టం (ఏడబ్ల్యూపీఐ) 1960, 2023 నిబంధనల ప్రకారం ఇదంతా చేస్తున్నా జనాలకు మాత్రం కుక్క కాట్లు తప్పడం లేదు.
యానిమల్ బర్త్ కంట్రోల్(ఏబీసీ), యాంటీ రేబిస్(ఏఆర్) కార్యక్రమాలకు కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. అయినా 70శాతం కుకలకు ఆపరేషన్లు కూడా చేయలేదని అధికారిక లెకలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలోనే రెచ్చిపోతున్న వీధి కుక్కలపై జనాలు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. వీధి కుకల నియంత్రణకు జీహెచ్ఎంసీ కొత్త పంథాను ఎంచుకుంది. 1960 ప్రివెన్షన్ ఆఫ్ క్రూయల్టీ యాక్ట్ 1960లోని సెక్షన్ 11(3)(బీ), 11(3)(సీ), జీహెచ్ఎంసీ 1955 చట్టంలోని సెక్షన్ 249 ప్రకారం ప్రమాదకరమైన, దీర్ఘాకాలిక రోగాలబారిన పడిన కుకలను యుథానాసియా (మెర్సీ కిల్లింగ్) ద్వారా (కుకలకు స్టెరిలైజేషన్ సమయంలో మత్తు ఇంజెక్షన్లను ఎకువ మోతాదులో ఇచ్చి చంపడం) చంపడానికి అనుమతివ్వాలని జీహెచ్ఎంసీ హైకోర్టును కోరింది.
అయితే దీనిపై హైకోర్టు ఏలాంటి నిర్ణయం తీసుకుంటదనేది చూడాల్సిందే. ఒకవేళ మెర్సీ కిల్లింగ్ కి హైకోర్టు అనుమతిస్తే యానిమల్ వెల్ఫేర్ బోర్డు ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారమే ప్రాసెస్ పూర్తి చేయాల్సి ఉంటుంది. 2008లో బాంబే హైకోర్టు, 2015లో కేరళ హైకోర్టులు కుకలను మెర్సీ కిల్లింగ్కి అనుమతిచ్చాయి. ఈ అంశాన్ని సవాల్ చేస్తూ యానిమల్ యాక్టివిస్టులు సుప్రీం కోర్టుకు వెళ్లారు. కేంద్ర పశుసంవర్ధక శాఖ కూడా 2022లో తెచ్చిన యానిమల్ బర్త్ కంట్రోల్ రూల్స్ లో మెర్సీ కిల్లింగ్ ను సమర్థించింది.