మాదాపూర్: మాదాపూర్‌లోని సియెట్ కాలనీలోని సున్నం చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో కొన్నిరోజులుగా హైడ్రా అధికారులు చేపట్టిన పూడికతీత పనులను హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ సోమవారం పరిశీలించారు. అయితే రంగనాథ్ పర్యటన, ఎఫ్టీఎల్ పరిధి దాటి చేపడుతున్న పనులను కాలనీవాసులు అడ్డుకుంటారనే అనుమానంతో పోలీసులు వారిని ముందస్తుగా అదుపులోకి తీసుకొని సాయంత్రం పంపించివేశారు.
కోర్టు ఆదేశాలను కూడా పాటించకుండా హైడ్రా అధికారులు ఇష్టానుసారం పనులను చేస్తున్నట్లు కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక పోలీసులను అరెస్టుల విషయమై వివరణ కోరగా హైడ్రా ఇన్స్పెక్టర్ పలుమార్లు ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వడంతోనే స్థానికులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. హైడ్రా ఇన్స్పెక్టర్ రాజశేఖర్‌ను అడుగగా ప్రివెంటివ్ అరెస్ట్ కింద కాలనీవాసులను పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలిపారు. సున్నం చెరువులో కోర్టు ఆదేశాలకు అనుగుణంగానే పనులను చేపడుతున్నట్లు స్పష్టం చేశారు.