సిటీబ్యూరో, ఏప్రిల్ 22(నమస్తే తెలంగాణ): నగరంలో ఎప్పుడు కరెంట్ పోతుందో, ఎప్పుడు వస్తుందో తెలియక వినియోగదారులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. దీంతో దక్షిణ డిస్కం వ్యవహార శైలిపై మండిపడుతున్నారు. రెండేళ్ల క్రితం ముందస్తు ప్రణాళికతో ఎ ప్పుడెలాం టి ఇబ్బంది రాకుండా 24 గంటల విద్యుత్ సరఫరాతో రికార్డు సృష్టించిన దక్షిణ డిస్కం ఇప్పుడు అప్రకటిత కరెంట్ కోతలతో అభాసుపాలవుతోంది.
ముఖ్యం గా ఉన్నతాధికారుల అలసత్వం, సిబ్బంది నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తుందన్న విమర్శలు ఉన్నాయి. రెండు నెలల క్రితం సీఎండీల మార్పు తర్వాత వినియోగదారులకు అనుకూలంగా పరిస్థితి మెరుగవుతుందని ఆశించినా ప్రస్తుతం కార్పొరేట్ ఆఫీసులోని పరిణామాలతో విద్యుత్ సరఫరా, కమ్యూనికేషన్ విషయంలో పరిస్థితి మరింత అధ్వాన్నంగా మారిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
2026 సమ్మర్ యాక్షన్ ప్లాన్లో భాగంగా గత అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు పనుల ప్రణాళిక రూపొందిస్తున్నామని చెప్పిన యాజమాన్యం ఆ తర్వాత జనవరి, ఫిబ్రవరిలో టెండర్లు పిలిచి హడావిడి చేసింది. టెండర్లలో పేర్కొన్న పనుల్లో చాలావరకు కేబుల్ ఆధారిత పనులు కావడంతో అవి అగ్రిమెంట్లు చేసుకోవడం తప్ప మొదలు పెట్టలేదు. ముఖ్యంగా ఈ వేసవిలో విద్యుత్ వినియోగం 110 మిలియన్ యూనిట్లకు చేరుతుందని అధికారులు ముందు నుంచి అంచనా వేసి అందుకు తగినట్లుగా ప్రణాళిక రూపొందించినా డిస్కం ఉన్నతాధికారులు, ప్రభుత్వంలోని ఒక కీలక మంత్రికి మెటీరియల్ విషయంలో వ్యవహారం కుదరక రెండేళ్లుగా ఈ పనులు వాయిదా పడుతూనే ఉన్నాయి.
ఇదిలా ఉంటే మళ్లీ ఏప్రిల్ 6వ తేదీన మరికొన్ని సమ్మర్ యాక్షన్ పనులంటూ టెండర్లు పిలవడం ప్రస్తుతం మింట్కాంపౌండ్తో పాటు మొత్తం డిస్కంలోనే చర్చనీయాంశంగా మారింది. ఈ టెండర్లకు ఈనెల 21వ తేదీ వరకు చివరితేదీ ప్రకటించడం అసలు వేసవికాలంలో చేయాల్సిన పనులకు ఇప్పుడు టెండర్ పిలవడమేంటనే చర్చ జరుగుతోంది. ఇప్పటివరకు వేసవి ప్రణాళికలో కీలకమైన పనులు మొదలేపెట్టలేదు. ఇదిలా ఉంటే తాజాగా మరి కొన్ని పనులను సమ్మర్ యాక్షన్ ప్లాన్ కింద పెట్టి టెండర్లకు పిలవడం డిస్కం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలుస్తోంది.
వేసవి రావడానికి మూడు నెలల ముందు నుంచే చేపట్టాల్సిన పనులకు మెటీరియల్ ప్రత్యేకించి కేబుల్ కొనుగోలు అడ్డంకిగా మారగా తాజాగా మరోసారి వేరే పనులకు టెండర్లు పిలవడం హాస్యాస్పదంగా కనిపిస్తోంది. ఈ విషయంలో ఎస్పీడీసీఎల్లో కొందరు ఉన్నతాధికారులు తామేం చేయాలో తెలియక జరుగుతున్న వ్యవహారాన్ని చూసి గతంలో ఎప్పుడూ ఈ పరిస్థితి లేదని, గత రెండేళ్లుగా దక్షిణ డిస్కంను భ్రష్టు పట్టించారని అంతర్గతంగా విమర్శిస్తున్నారు. ఎప్పుడైనా సమ్మర్లో సమ్మర్ యాక్షన్ ప్లాన్ అంటూ చేస్తారా.. ఆ పేరుతో టెండర్లు పిలవడం మొత్తం డిస్కం చరిత్రలోనే ఇది మొదటిసారి అనీ, ఇంత అధ్వాన్నంగా ఎప్పుడూ పరిపాలన లేదని విద్యుత్ రంగ నిపుణులు మండిపడుతున్నారు.
2025 జనవరిలో పిలిచిన సమ్మర్ యాక్షన్ ప్లాన్ పనులకు టెండర్లు పూర్తిచేసి అగ్రిమెంట్లు కూడా పూర్తయ్యాయి. సుమారు 20 పనులకు ఫిబ్రవరిలో అగ్రిమెంట్లు చేసుకున్న కాంట్రాక్టర్లు ఒక్కొక్కరూ 60నుంచి 70లక్షల ఈఎండీలు కట్టి ఉన్నారు. అయితే వారు చేయాల్సిన పనులకు మెటీరియల్ ప్రత్యేకించి కేబుల్ లేకపోవడంతో ఆ పనులు మొదలు పెట్టే పరిస్థితే లేదు. ఈలోగా సమ్మర్ పూర్తయి మళ్లీ సమ్మర్ ప్లాన్ అంటూ మరికొన్ని కొత్త పనులకు టెండర్లు పిలిచారు.
పాత పనులు అగ్రిమెంట్లు పూర్తి చేసుకుని సంవత్సరంన్నర గడిచినా అతీగతీ లేకపోగా కొత్త పనులకు కూడా అగ్రిమెంట్లు చేసుకున్నారు. డిస్కంలో కొందరు అధికారులు స్వయంగా కాంట్రాక్టర్లతో తామేం చేయలేమని, తమ కోసమైనా అగ్రిమెంట్లు చేసుకుని ఉండమని కోరడంతో తమ పనులు ఎలాగోలా చేసుకోవాలి కదా అని మరోసారి పనులకు ఒప్పుకున్నారు. ఈ సంవత్సరం కూడా అదే పరిస్థితి నెలకొంది. తీరా మరోసారి ఈ నెలలో టెండర్లు పిలిచి పనులకు బిడ్ ఓపెన్ చేయాలని అధికారులు నిర్ణయించడంతో ఎందుకు పనులను ప్లాన్లో పెడుతున్నారు.. ఎందుకు టెండర్లు పిలుస్తున్నారు..
ఎందుకు అగ్రిమెంట్లు చేసుకుంటున్నారు.. లక్షలకు లక్షలు ఈఎండీలు కట్టి తమ డబ్బులు చిక్కుపడిపోతుంటే సమాధానం చెప్పకుండా ఇంకా వేధించడమేంటని కాంట్రాక్టర్లు అధికారులను నిలదీస్తున్నట్లు సమాచారం. సీఎండీ ఎలా చెబితే తాము అలాగే చేయాలి తప్ప తమ చేతిలో ఏం లేదని జోన్ల అధికారులు కాంట్రాక్టర్లను సముదాయించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిసింది. ఇదే సమయంలో ఇటీవల కార్పొరేట్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో సీఎండీ జితేష్ పాటిల్ కేబుల్ విషయంలో తామేం చేయలేమని, ఓహెచ్ (ఓవర్హెడ్) పనులు ఎక్కడెక్కడ జరగాలో గుర్తించి వాటిని పూర్తి చేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిసింది. దీంతో అధికారులంతా ఓహెచ్ పనులను గుర్తించేందుకు సిద్ధమైనట్లు సమాచారం.