‘అతడి పేరు పరశురామ్ గౌడ్. నాచారం ఆటో డ్రైవర్. ఆటోను నమ్ముకుని జీవన సాగించాడు. కుటుంబాన్ని పోషించాడు. కాంగ్రెస్ తీసుకొచ్చిన ఉచిత బస్సు స్కీంతో ఆటో గిరాకీ లేకపోవడంతో పరశురామ్‌కు కష్టాలు మొదలయ్యాయి. ఓ వైపు ఫైనాన్స్ ఆటో, మరోవైపు ఇల్లు కిరాయి.. అప్పులు.. ఇవన్నీ అతడిని చుట్టు ముట్టాయి. అనారోగ్యానికి సైతం గురయ్యాడు. కొన్ని రోజులు ఆసుపత్రుల్లో సైతం చికిత్స పొందాడు. ఇక ఆటోను నమ్ముకుంటే బతికే పరిస్థితి కనిపించకపోవడంతో ఏం చెయ్యాలో తెలియక అక్టోబర్ 7న ఉదయం 8:30 గంటలకు ఉరేసుకుని చనిపోయాడు. దీంతో ఆ కుటుంబం రోడ్డున పడింది. ఇప్పటికీ ఆ కుటుంబానికి రేవంత్ సర్కారు ఎలాంటి సాయం అందించలేదు.’
Auto Drivers | సిటీబ్యూరో: ఆటో డ్రైవర్లు పిట్టల్లా రాలుతుంటే కాంగ్రెస్ సర్కారుకు చీమకుట్టినట్టు కూడా లేకపోవడం విచారకరమని వాహన సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ గద్దెనెక్కినప్పటి నుంచి ఇప్పటి వరకు సుమారు 80 మందికి పైగా రాష్ట్ర వ్యాప్తంగా ఆత్మహత్యలు చేసుకున్నారని.. ఒక్క ఆటో డ్రైవర్ చావుపై కూడా సర్కారు మాట్లాడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు అరచేతిలో వైకుంఠం చూపించారని.. అధికారంలోకి వచ్చాక డ్రైవర్లను పట్టించుకున్న పాపానపోలేదని బీఆర్టీయూ, తెలంగాణ క్యాబ్ అసోసియేషన్, టీఏడీయూ సంఘాల నాయకులు మారయ్య, షేక్ సలావుద్దీన్, సత్తిరెడ్డిలు ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.
తాజాగా ఏటూరు నాగారంలో గిరాకీ లేక ఆటో డ్రైవర్ నాగరాజు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటనపై వాహన సంఘాల నాయకులు స్పందించారు. ఆటో డ్రైవర్లను ఆదుకుంటామని సర్కారు మాటిచ్చిందని..కానీ ఆ దిశగా ఎలాంటి చర్యలు ప్రారంభించలేదని విమర్శించారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి కూడా తొలుత చర్చల పేరిట హడావిడీ చేసినా.. ఇప్పుడు చర్చల ఊసెత్తడం లేదన్నారు. ఇటీవల చలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం కూడా మంత్రి పొన్నం హామీతో నిలుపుదల చేసినప్పటికీ మంత్రి మాత్రం సమస్యల పరిష్కారానికి ముందుకు రావడం లేదని వాపోయారు.
రవాణా శాఖ మంత్రి స్పందించాలి
మహాలక్ష్మి పథకం అమలులో నష్టపోతున్న ఆటోడ్రైవర్లను ఆదుకుంటామని హామీ ఇచ్చి.. ఇప్పటి వరకు ఎలాంటి సాయం అందించలేదు. ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలకు కాంగ్రెస్ సర్కారే బాధ్యత వహించాలి. డ్రైవర్ల సమస్యలను పరిష్కరించడంలో రేవంత్ సర్కారు విఫలమైంది. ఓ వైపు గిరాకీ లేక.. మరోవైపు ఆన్లైన్ ఆధారిత వాహన సేవలతో డ్రైవర్లు పూర్తిగా నష్టపోతున్నారు. ప్రభుత్వం యాప్ తీసుకొస్తానని మాటిచ్చి.. ఇప్పుడు చోద్యం చూస్తున్నది. ప్రైవేట్ ఫైనాన్షియర్లు డ్రైవర్లను జలగల్లా పీడిస్తున్నారు. గిరాకీ లేకపోతే వాళ్లు డబ్బులు ఎలా చెల్లిస్తారు? కుటుంబాన్ని ఎలా పోషిస్తారు? రవాణా శాఖ మంత్రి దీనిపై స్పందించాలి.
-షేక్ సలావుద్దీన్, తెలంగాణ క్యాబ్ అసోసియేషన్ అధ్యక్షుడు
పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం..
రాష్ట్రంలో మహాలక్ష్మి ఉచిత బస్సుతో ఆటో డ్రైవర్లు ఉపాధి కోల్పోయారు. కండ్ల ముందు డ్రైవర్ల దీనస్థితి కనిపిస్తున్నా.. ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదు. ఇదేం పద్ధతి? కనీసం ఆత్మహత్య చేసుకున్న కుటుంబాన్ని కూడా ఓదార్చిన పాపానపోలేదు. ఆత్మహత్య చేసుకున్న ప్రతీ డ్రైవర్ కుటుంబంలో ఒక్కరికీ ప్రభుత్వ ఉద్యోగం, డబుల్ బెడ్రూం అందించాలి. ఆటో డ్రైవర్లకు ఏడాదికి రూ. 12వేలు ఇస్తామని హామీ ఇచ్చి.. అది కూడా నెరవేర్చలేదు. దీనిపై రవాణా శాఖ మంత్రి పొన్నం ఇప్పటి వరకు నోరు మెదపకపోవడం విడ్డూరం. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ముందుకు రాకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం.
-వేముల మారయ్య, బీఆర్టీయూ ఆటో యూనియన్ అధ్యక్షుడు
రూ. 12వేలు కూడా ఇవ్వలేదు..
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని మాటిచ్చి ఇప్పటికీ చేయలేదు. ఏడాదికి రూ.12వేలు కూడా ఇవ్వలేదు. పార్కింగ్ సమస్య, ఇష్టానుసారంగా చలాన్లు విధించడం తదితర కార్యకలాపాలతో మేమంతా విసిగిపోతున్నాం. గత ప్రభుత్వ హయాంలో డ్రైవర్లు తమ సమస్యలను చెప్పుకుంటే సత్వరమే పరిష్కారమయ్యేవి. గతంలో రెండు త్రైమాసిక వాహన పన్నును కేసీఆర్ సర్కారు రద్దు చేసింది. డ్రైవర్ల కోసం రూ.5లక్షల ఎక్స్‌గ్రేషియా కూడా తీసుకొచ్చారు. కానీ కాంగ్రెస్ సర్కారు మాత్రం డ్రైవర్ల ఆత్మహత్యలే లక్ష్యంగా కక్ష సాధిస్తున్నది.
-సత్తిరెడ్డి, టీఏడీయూ అధ్యక్షుడు