
బంజారాహిల్స్, సెప్టెంబర్ 29 : ప్రియుడు మోసం చేయడంతో మనస్తాపం చెందిన ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగు చూసింది. ఫిలింనగర్‌లోని జ్ఞానిజైల్‌సింగ్‌నగర్ బస్తీలో ఉంటున్న కావలి అనురాధ (22) సినీ పరిశ్రమలో జూనియర్ ఆర్టిస్ట్‌గా పనిచేస్తున్నది. కొంత కాలంగా కిరణ్ అనే యువకుడితో ప్రేమలో ఉన్నది. పెండ్లి చేసుకుంటానని నమ్మించిన కిరణ్.. ఇటీవల మరో యువతితో ఎంగేజ్మెంట్ చేసుకున్నాడని తెలిసింది.
ఈ విషయంపై కొద్ది రోజులుగా వారిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. మూడు రోజుల కిందట కిరణ్ వదిలేసి వెళ్లిపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన అనురాధ.. తన గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. రెండు రోజుల తర్వాత ఆమె గది నుంచి దుర్వాసనలు వస్తుండటంతో స్థానికులు బంజారాహిల్స్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతురాలి సోదరి సరోజ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుడు కిరణ్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.