సిటీబ్యూరో, ఏప్రిల్ 14 (నమస్తే తెలంగాణ): శివారు ప్రాంతాలే లక్ష్యంగా గంజాయి స్మగ్లింగ్ ముఠాలు తమ దందాను కొనసాగిస్తున్నాయి. సరఫరాకు యువతను, కార్మికులను వినియోగించుకుంటున్నారు. ఇక్కడ పోలీసుల నిఘా తక్కువ ఉంటుందనే అక్కడి నుంచి దందాను నడిపిస్తున్నారు. ముఖ్యంగా ఏపీ, ఒడిశా రా నుంచి గంజాయిని రవాణా చేస్తున్న కొందరు మారుమూల ప్రాంతాలను అడ్డాలు గా చేసుకుంటున్నారు.
మరికొన్ని ముఠాలు శివారుల మీదుగా మహారాష్ట్ర, యూపీ, మధ్యప్రదేశ్ రాష్ర్టాలకు గంజాయిని స్మగ్లింగ్ చేస్తున్నాయి. అయితే పోలీసుల నిఘాకు పట్టుబడుతున్నవి కొంతే అని తెలుస్తోంది.. పట్టుబడని గంజాయి, హషీష్ ఆయిల్ , ఇతర డ్రగ్స్ చాలానే ఉంటుండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గంజాయి రవాణాను ఇతర రాష్ర్టాలకు రవా ణా చేస్తున్న సందర్భంగా పోలీసులకు పట్టుబడిన ముఠాలను విచారిస్తే… అప్పటికే రెండు మూడుసార్లు ఇదే రూట్లో గంజాయిని సరఫరా చేశామంటూ వెల్లడించిన ఘటనలున్నాయి.
పోలీసుల నిఘాతో అప్పుడప్పుడు గంజాయి ముఠాలు పట్టుబడుతున్నాయి. నిఘాకు దొరకకుండా గంజాయి వ్యాపారం చేసే ముఠాలు కూడా ఉన్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. ఔటర్ రింగ్‌రోడ్డుకు అవతల అయితే పోలీసుల నిఘా తక్కువగా ఉంటుందనే భావనతో గంజాయి ముఠాలు అక్కడి నుంచే దందా నడిపిస్తున్నాయని సమాచారం. ఔటర్ రింగ్‌రోడ్డు లోపల పోలీసుల నిఘా ఉండడంతో పట్టుబడుతామనే భావన స్మగ్లర్లలో ఉంటుంది. అందుకే శివారు ప్రాంతాలను తమ అడ్డాలుగా చేసుకుంటూ.. యు వతను, కార్మికులను గంజాయి రవాణాకు వినియోగించుకుంటున్నారని సమాచారం.
శివార్ల ప్రాంతాల్లోనే..
ఇటీవల మల్కాజిగిరి ఎస్ఓటీ పోలీసులు.. భువనగిరి పోలీసులతో కలిసి 4 కిలోల హషీష్ ఆయిల్‌ను సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్న ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఈ ముఠా హైదరాబాద్‌తో పాటు పరిసరాల్లో గంజాయిని విక్రయించేందుకు ఏపీ, నర్సీపట్నంకు చెందిన పేట్ల శేఖర్, అతని స్నేహితుడు అన్మిరెడ్డిలు గంజా దుర్గా అనే ప్రధాన డ్రగ్ విక్రేత వద్ద నుంచి హషీష్ ఆయిల్ తీసుకొని హైదరాబాద్‌కు బయలుదేరి, భువనగిరిలో పట్టుబడిన విషయం తెలిసిందే.
ఈ ముఠా ప్రధానంగా శివార్లలోనే విక్రయించేందుకు సిద్ధమయ్యారు. అన్మిరెడ్డి వృత్తిరీత్యా లారీ డ్రైవర్ కావడంతో పాటు శివారు ప్రాంతాలపై అవగాహన ఉంది. దీంతో ఇంజినీరింగ్, ఇతర పీజీ కాలేజీలు ఎక్కువగా ఉన్న చోట, ఆ పరిసర ప్రాంతాల్లో యువత కూడా ఎక్కువగానే ఉంటుంది, దీంతో పాటు ఎక్కువగా కార్మికులు ఉన్న చోట కూడా గిరాకీ ఉండే అవకాశాలుంటాయని భావించిన ఈ ముఠా.. శివారు ప్రాంతాలను ఎంచుకొని ఉంటాయని పోలీసులు భావిస్తున్నారు. కొత్తగా వచ్చే ముఠాలు మొదట శివారు ప్రాంతాల్లో ఒకటి రెండు సార్లు డెలివరీ చేసిన తరువాత.. సిటీలోకి ఎంట్రీ అవుతూ ఒక ప్రాం తం నుంచి మరో ప్రాంతానికి గంజాయిని సరఫరా చేస్తుంటారు.
రాష్ర్టాలు దాటేస్తుంటాయి..
మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్ వంటి రాష్ర్టాలకు గంజాయి తెచ్చి ఇచ్చే బాధ్యతను కొన్ని ముఠాలకు అక్కడి డ్రగ్ విక్రయ ముఠాలు అప్పగిస్తుంటాయి. దీంతో ఆయా రాష్ర్టాల నుంచి డ్రగ్స్‌ను అక్రమ రవాణా చేసేందుకు ఈ ముఠాలు రంగంలోకి దిగుతుంటాయి. ఏపీ, ఒడిశాలలో గంజాయి విక్రేతలతో మాట్లాడి గం జాయి, హషీష్ ఆయిల్‌ను రవాణా చేస్తుంటాయి. పోలీసుల నిఘా నుంచి తప్పించుకోవడం కోసం కొందరు లారీలు, వ్యాన్లలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుండగా, మరికొందరు గంజాయి ఉండే వాహనానికి ముందు, వెనుక పైలెట్‌లా వ్యవహారిస్తుంటారు.
మరికొందరు మరో అడుగు ముందుకేసి ఎవరి ప్రమేయం లేకుండా సోలోగా వాహనాన్ని నడుపుతూ అనుకున్న చోటకు గంజాయిని చేర్చేందుకు ప్రయత్నించిన ఒకరు ఇటీవల మహేశ్వరం ఎస్ఓటీ పోలీసులకు 300 కిలోల గంజాయితో పట్టుబడ్డాడు. పట్టుబడ్డ నిందితుడు అహ్మద్ గులాబ్ షేక్ గతంలోను రెండు సార్లు 450 కిలోల గంజాయి రవాణా చేసి సక్సెస్ అయ్యాడు. మూడో సారి పోలీసులకు పట్టుబడ్డాడు. ఇలా పోలీసుల కండ్లుగప్పి గంజాయి రవాణా జరుగుతున్నది ఎక్కువగానే ఉంటుందని సమాచారం.
సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఆత్మహత్య
వెంగళరావునగర్, ఏప్రిల్ 14: ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…నాగ్‌పూర్‌కు చెందిన యువతి, రుడాల్ఫ్ ఆంటోని(31) లు 2022 లో ప్రేమ వివాహం చేసుకున్నారు. ఉద్యోగ రీత్యా 2023లో హైదరాబాద్‌కు వచ్చి అమీర్‌పేట డీకే రోడ్డులో నివాసం ఉంటున్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉండడంతో భార్య కూడా ఉద్యోగం చేస్తే బాగుంటుందని భావించాడు.
ఈ క్రమంలో భార్యకు ఉద్యోగం ఇప్పిస్తానని ఆల్వాల్‌లో ఉండే స్నేహితుడు ..ఆంటోనీ నుంచి రూ.4.50 లక్షలు వసూలు చేశాడు. కాలం గడుస్తున్నా ఉద్యోగం రాకపోవడం తో తన డబ్బు తిరిగి ఇచ్చేయాలని ఆదివారం రాత్రి ఆల్వాల్ లో ఉండే స్నేహితుడి ఇంటికి వెళ్లి గొడవ పడినట్లు సమాచారం. కష్టపడి కూడబెట్టిన డబ్బు స్నేహితుడు మోసం చేసి కాజేశాడని దిగులు చెందేవాడు. ఆదివారం రాత్రి 10.30 ప్రాంతంలో ఇంటికి తిరిగి వచ్చి గదిలోకి వెళ్లి ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎంతసేపటికీ తలుపులు తీయకపోవడంతో భార్య .. స్నేహితుల సాయంతో త లుపులు పగులగొట్టి చూడగా అప్పటికే ఆంటోని వేలాడుతూ కనిపించాడు.. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
వెస్ట్ శ్రీనివాసనగర్ లోవ్యక్తి ..
వెంగళరావునగర్, ఏప్రిల్ 14 : ఆర్థిక ఇబ్బందులతో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల వివరా ల ప్రకారం.. వెస్ట్ శ్రీనివాసనగర్‌లో నివాసం ఉంటున్న కె.సునీల్(45) ఓ హోటల్ లో మేనేజర్‌గా పని చేసేవాడు. అతని భార్య ప్రభుత్వ దవాఖానలో న ర్సుగా పనిచేస్తుంది. ఇటీవల ఖమ్మంకు బదిలీ కావడంతో ఆమె.. ఇద్దరు పిల్లలను తీసుకుని అక్కడికి వెళ్లింది, అయితే ఆదివారం భర్తకు ఎన్ని సార్లు ఫోన్ చేసినా సమాధానం రాకపోవడంతో భర్త స్నేహితుడు సురేశ్‌కు ఫోన్ చేసి చెప్పింది. వెంటనే అతను వెళ్లి చూసేసరికి ఫ్యాన్‌కు వేలాడుతూ సునీల్ కనిపించాడు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చురీకు తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.