సిటీబ్యూరో, మే 25(నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని సెలూన్లు, లాండ్రీషాపుల సబ్సిడీ విద్యుత్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. బీఆర్ఎస్ హయాంలో నాయూబ్రాహ్మణ, రజక వృత్తిదారులకోసం తీసుకొచ్చిన 250 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకం నేడు అటకెక్కింది. సబ్సిడీ బిల్లుల చెల్లింపులో కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం, విద్యుత్ అధికారుల వేధింపులతో లబ్ధిదారులు సతమతమవుతున్నారు. గత ఆర్థిక సంవత్సరంలో వివిధ పథకాల కింద డిస్కమ్‌లకు.. లబ్ధ్దిదారులకు సంబంధించిన బకాయిల చెల్లింపులో జాప్యం జరిగింది.
ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని లాండ్రీలు, ధోబీఘాట్లు, సెలూన్లకు 250 యూనిట్ల ఉచిత సరఫరాపై ఆందోళన వ్యక్తమవుతున్నది. బీఆర్ఎస్ ప్రభుత్వం రజకులచే నడుపుతున్న లాండ్రీలు, ధోబీఘాట్లకు 2021 ఏప్రిల్ 1 నుంచి 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరాను ప్రారంభించింది. అదే విధంగా కటింగ్ షాపులకు కూడా అదేరోజున ఈ సరఫరాను ప్రా రంభించారు. అలాగే లబ్ధిదారుల పేర్లను నమోదు చేయడానికి ఒక వెబ్‌సైట్‌ను కూడా రూపొందించారు. రాష్ట్రవ్యాప్తంగా రజక వృత్తిదారుల నుంచి 76,0 60 లాండ్రీ యూనిట్లు, 143 ధోబీఘాట్లు ఈ పథకం కింద లబ్ధి పొందుతుండగా గ్రేటర్‌లోని అపార్ట్మెంట్లు, కాలనీలు, వీధుల్లో ఏర్పాటుచేసిన దాదాపు 20వేల లాండ్రీలు, 52 ధోబీఘాట్లకు ఉచిత విద్యుత్ వర్తిస్తున్నది.
తద్వారా ఒక్కో ధోబీఘాట్ పరిధిలో 250మందికి పైగా బట్టలు ఉతికేవారికి కలిపి మొత్తం లక్షన్నరమందికి ప్రయోజనం దక్కుతున్నది. అదే విధంగా నాయీబ్రాహ్మణ కమ్యూనిటీ పథకం కింద సెలూన్లకు ఉచితంగా 250 కూనిట్ల విద్యుత్‌ను సరఫరా చేయడం ద్వారా ఆ కమ్యూనిటీ నుంచి 36,526 మంది నాయీబ్రాహ్మణులు లబ్ధిపొందుతున్నారు. లబ్దిదారులకు సొంత కమర్షియల్ విద్యుత్ కనెక్షన్‌ను సైతం ప్రభుత్వమే అందించింది. ప్రభు త్వం ప్రతీనెలా 250 యూనిట్ల విద్యుత్ వినియోగానికి అయ్యే బిల్లును విద్యుత్ బిల్లులో సబ్సిడీ కింద మినహాయించేది. 250 యూనిట్లకు మించి వాడిన యూనిట్లకు మాత్రమే లబ్ధిదారులు బిల్లును చెల్లించుకునేవారు. కానీ, కాంగ్రె స్ సర్కార్ వచ్చిన తర్వాత అధికారులు గతానికి భిన్నంగా వ్యవహరిస్తున్నారు.
250 యూనిట్ల చార్జీని విద్యుత్ బిల్లులో సబ్సిడీగా మాత్రమే చూపుతున్నారు. మొత్తం బిల్లులో సబ్సిడీ నగదును మినహాయించకుండా, దానినీ కలిపే చూపుతున్నారు. దీంతో ఒక్కో యూనిట్‌పై వేలల్లో బిల్లులు పెండింగ్‌లో ఉన్నట్లు చూపుతున్నది. అయితే గత రెండు ఆర్థిక సంవత్సరాలుగా ఉచిత విద్యుత్ పథకం అమలుకు సంబంధించి డిస్కమ్‌లకు చెల్లించాల్సిన బకాయిలను చెల్లించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది. తెలంగాణ వాషర్‌మ్యాన్ కో ఆపరేటివ్ సొసైటీస్ ఫెడరేషన్ లిమిటెడ్ తెలంగాణ నాయీబ్రాహ్మణులకు దాదాపు రూ.247 కోట్ల బకాయిపడగా నాయీబ్రాహ్మణ్ కో ఆపరేటివ్ సొసైటీస్ ఫెడరేషన్ లిమిటెడ్ రూ.67 కోట్ల బకాయి పడింది. 2025-26 బడ్జెట్లో తెలంగాణ వాషర్‌మ్యాన్ కో ఆపరేటివ్ సొసైటీస్ ఫెడరేషన్ లిమిటెడ్‌కు రూ.150 కోట్లు కేటాయించారు.
దీనిలో భాగంగా రూ.37.50కోట్లు విడుదల చేసినప్పటికీ, ఇప్పటివరకు అందులో నుంచి ఒక్కరూపాయి కూడా ఫెడరేషన్లకు చెల్లించలేదు. తెలంగాణ నాయీబ్రాహ్మణుల సహకార సంఘాల సమా ఖ్య లిమిటెడ్‌కు రూ.100కోట్లు కేటాయించగా రూ.25కోట్లు విడుదల చేశారు. కానీ ఏ క్షౌరశాల ఈ పథకం పరిధిలోకి రాలేదు. కొన్ని సందర్భాల్లో ఒక్కో హెయిర్కటింగ్సెలూన్ 250 ఉచిత యూనిట్ల విద్యుత్ సరఫరా పథకం కింద రూ.80 వేల నుంచి రూ.1 లక్ష వరకు బకాయిపడింది. ఈ నేపథ్యంలోనే బిల్లుల చెల్లింపు కోసం విద్యుత్ అధికారులు లబ్ధిదారులను వేధింపులకు గురిచేస్తున్నారు.
రెండేళ్లుగా ఒక్క లబ్ధిదారుడూ చేరని వైనం..
ఇదిలా ఉంటే గత రెండు ఆర్థిక సంవత్సరాల నుంచి ఈ పథకం కింద ఏ ఒక్క కొత్త లబ్దిదారుడూ చేరలేదు. గతంలో పలు దఫాలుగా విద్యుత్ సంస్థలు తమ బకాయిలు చెల్లించకపోతే విద్యుత్ సరఫరాను నిలిపివేస్తామని హెయిర్సెలూన్లను, లాండ్రీషాపులను బెదిరించిన సందర్భాలూ ఉన్నాయి. బీసీ సంక్షేమశాఖ, ఇంధనశాఖతో మాట్లాడి ఈ బెదిరింపులు ఆపాలని, ప్రభుత్వం సబ్సిడీ డబ్బులు చెల్లిస్తుందని చెప్పినప్పటికీ తమకు డబ్బులు రాకపోవడంతో కొన్నిచోట్ల ఇప్పటికీ వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయని రజకులు, క్షౌరశాలల యజమానులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే కొన్ని సందర్భాల్లో తమ బిల్లుల్లో సబ్సిడీ బిల్లునుకూడా కలిపి ఇవ్వడంతో తమకు విద్యుత్ బిల్లులు తడిసి మోపెడవుతున్నాయని, ఈ విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో తాము చాలా ఇబ్బందులు పడుతున్నామని వారు పేర్కొన్నారు.