అంబర్‌పేట, జూలై 3 : హాస్టళ్లలో చదువుతున్న విద్యార్థుల మెస్ చార్జీలు పెంచి వారికి మంచి పౌష్టికాహారం అందిస్తున్నామని ప్రభుత్వం చెబుతున్న మాటలకు క్షేత్రస్థాయిలో జరుగుతున్న దానికి పొంతన లేదు. పౌష్టికాహారం మాట దేవుడెరుగు.. ప్రభుత్వం ఇచ్చిన మెనూను కూడా సరిగా అమలు చేయడం లేదు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఆహారం పెట్టడం లేదు.
అపరిశుభ్రమైన వాతావరణంలో విద్యార్థులు హాస్టల్లో ఉండాల్సిన దుస్థితి దాపురిచింది. తమకు మెనూ ప్రకారం ఎందుకు ఆహారం పెట్టడం లేదని అడిగితే బూతులు తిట్టడం, వేధించడం సదరు హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పనిగా పెట్టుకున్నాడు. చివరకు ఆ విద్యార్థులు చదువుతున్న కాలేజీకి వెళ్లి లేనిపోని ఆరోపణలు ప్రిన్సిపాల్‌కు చెప్పడం చేస్తున్నాడు. అతని బాధలు భరించలేక ఆ హాస్టల్ విద్యార్థులంతా రోడ్డెక్కారు. నేరుగా జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.
అంబర్‌పేట నియోజకవర్గం, గోల్నాక ఛే నంబర్ దారిలో వర్ధమాన్ స్టీల్ కంపెనీ వద్ద ప్రభుత్వ బీసీ బాలుర కళాశాల వసతి గృహం(సికింద్రాబాద్, కంటోన్మెంట్) ఉంది. ఇందులో మొత్తం 340 మంది విద్యార్థులు ఉన్నారు. కానీ ఎప్పుడు కూడా అంతమందికి వంట వండటం లేదని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన మెనూను ఇక్కడ పాటించడం లేదు. ప్రతి రోజూ సాయంత్రం స్నాక్స్ ఇవ్వాల్సి ఉండగా, రెండు నెలలుగా ఇవ్వడం లేదని విద్యార్థులు వాపోతున్నారు. మధ్యాహ్నం అన్నంతో ఒకరోజు సాంబారు, లేదంటే కర్రీ ఒకటే ఇస్తున్నారని చెప్పారు. ఉడికీ ఉడకని కోడిగుడ్లను ఇస్తున్నారు. నాణ్యతలేని ఆహారం సరఫరా చేస్తున్నారన్నారు.
ఈ వసతిగృహంలో అపరిశుభ్రమైన వాతావరణం తాండవిస్తున్నది. బాత్రూమ్లు, మరుగుదొడ్లు అధ్వానంగా ఉన్నాయని చెప్పారు. వాటిని చూస్తేనే వాంతులు తప్పవని తెలిపారు. ఇదేమని ఇక్కడ విధులు నిర్వర్తిస్తున్న హాస్టల్ వెల్నేర్ ఆఫీసర్ నాగిళ్ల తిరుపతిని విద్యార్థులు అడిగితే సమాధానం చెప్పకుండా నిర్లక్ష్యం వహించడమే కాకుండా బూతులు తిడుతున్నాడని, టార్గెట్ చేసి వేధిస్తున్నాడని పలువురు విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు.
హాస్టల్ వెల్నేర్ ఆఫీసర్‌గా విధులు నిర్వర్తిస్తున్న నాగెళ్ల తిరుపతి బాధలు, వేధింపులు భరించలేక విద్యార్థులు బుధవారం రాత్రి రోడ్డెక్కారు. ఈ వార్డెన్ తమకు వద్దని, తమకు రావాల్సిన మెనూ ప్రకారం భోజనం వడ్డించాలని ఛే నంబర్ రోడ్డుపై నిరసన తెలిపారు. అతన్ని బదిలీ చేయాలని డిమాండ్ చేశారు. చివరకు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. తగిన న్యాయం చేయాలని కోరారు.