ముషీరాబాద్ : పెరిగిన నిత్యావసర ధరలకు అనుగుణంగా విద్యార్థుల హాస్టల్ మెస్ చార్జీలు, స్కాలర్షిప్లు పెంచాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య (R. Krishnaiah) డిమాండ్ చేశారు. గురువారం విద్యానగర్‌లోని బీసీ భవన్లో చేపట్టిన మహా దీక్షలో ఆయన మాట్లాడారు. కళాశాల, పాఠశాల, హాస్టల్, గురుకుల పాఠశాల విద్యార్థుల స్కాలర్షిప్ (Scholarships) లు పెంచి బడుగు, బలహీన వర్గాల విద్యార్థులను ఆదుకోవాలని కోరారు.
రాష్ట్రంలోని ఎనిమిది లక్షలమంది ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టల్, గురుకుల విద్యార్థులు, 16 లక్షల మంది కాలేజీ విద్యార్థులు చాలిచాలని మెస్‌చార్జీలు (Messcharges), స్కాలర్‌షిప్‌లతో ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ఉద్యోగుల జీతాలు పెంచుతున్న ప్రభుత్వం విద్యార్థుల ఉపకార వేతనాలను విస్మరిస్తుందని ఆరోపించారు. ఆరు సంవత్సరాల క్రితం నాటి ధరలకు అనుగుణంగా మెస్ చార్జీలు చెల్లిస్తుండటం వల్ల నాసిరకం ఆహారాన్ని అందిస్తున్నారని వెల్లడించారు.
హాస్టళ్లలో సౌకర్యాలు కల్పించే ఆలోచన ప్రభుత్వానికి రాకపోవడం శోచనీయమని, పేద పిల్లలు చదువుకునే హాస్టళ్లను ప్రభుత్వం మానవతా ధృక్పతంతో చూడాలని కోరారు. వేముల రామకృష్ణ అధ్యక్షతన నిర్వహించిన దీక్షలో సంఘం ప్రతినిధులు సుధాకర్, నందగోపాల్, చంద్రశేఖర్‌గౌడ్, నరసింహగౌడ్, కృష్ణయాదవ్, నిఖిల్, హరీష్ తదితరులు పాల్గొన్నారు.