ఆదిభట్ల, ఫిబ్రవరి 10: స్కూల్ బస్సులు (School Bus) ప్రమాదాలకు కేరాఫ్‌గా మారుతున్నాయి. విద్యార్థులను క్షేమంగా స్కూల్‌కు, అటునుంచి ఇంటికి చేర్చాల్సిన విద్యా సంస్థల వాహనాలు ప్రమాదాలకు కారణమవుతున్నాయి. రెండు రోజుల క్రితం పెద్దఅంబర్‌పేటలో స్కూల్ కింద పడి హయత్‌నగర్ శ్రీచైతన్య స్కూల్ విద్యార్థిని మరణించిన విషయం తెలిసిందే. తాజాగా మరో స్కూల్ బస్సు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. అయితే విద్యార్థులు క్షేమంగా బయటపడటంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.
సోమవారం ఉదయం బొంగులూరు సమీపంలోని నలంద పాఠశాలకు చెందిన బస్సు.. ఆదిభట్ల మున్సిపాలిటీ పరిధిలోని కళ్లెం జంగారెడ్డి గార్డెన్ వద్ద డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో బస్సులో ఉన్న మూడో తరగతి విద్యార్థి సాత్విక్, పాఠశాలలో పనిచేస్తున్న అటెండర్ మంగమ్మకు, బస్సు డ్రైవర్ కిషన్ గాయపడ్డారు. స్థానికులు వారిని దవాఖానకు తరలించారు. పలువురు విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులు పది మంది విద్యార్థులు ఉన్నారు.