మేడ్చల్ కలెక్టరేట్, అక్టోబర్ 23 : పెండింగ్ ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను వెంటనే విడుదల చేయాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పుట్ట లక్ష్మణ్ డిమాండ్ చేశారు. ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో బుధవారం చలో కలెక్టరేట్ కార్యాలయం పేరుతో ఆందోళన కార్యక్ర మాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని ఆరోపించారు. అధికారం చేపట్టి 10 నెలలు కావస్తున్నా విద్యారంగ సమస్యలను పట్టించుకోవడం లేదన్నారు. ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల చెల్లింపునకు రూ.8వేల కోట్లను వెంటనే విడుదల చేయాల న్నారు.
మూడేళ్ల నుంచి బకాయిలు విడుదల చేయకపోవడంతో విద్యార్థులు కోర్సులు పూర్తి చేసినా కళాశాల యాజమాన్యాలు ధ్రువ పత్రాలను విడుదల చేయడం లేదని తెలిపారు. దీంతో వారు పై చదువులకు వెళ్లలేక, ఉద్యోగాలు చేసుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ నెల 27లోపు నిధులు విడుదల చేయకపోతే వేలాదిమంది విద్యార్థులతో హైదరాబాద్‌ను దిగ్బంధనం చేస్తామని ఆయన హెచ్చరించారు. అనంతరం అడిషనల్ కలెక్టర్ విజయేందర్ రెడ్డికి వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రహ్మన్, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు చిన్న, అన్వర్, నాయకులు హరీశ్, అరవింద్, శశిధర్, మహేశ్, దుర్గారావు, సమీర్, విద్యార్థులు పాల్గొన్నారు
సుల్తాన్‌బజార్: రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని ఏఐఎస్ఎఫ్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు చైతన్య యాదవ్ అన్నారు. ఈ మేరకు బుధవారం ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా హైదరాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ప్లకార్డులు ప్రదర్శిస్తూ ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన ..ఏఐఎస్ఎఫ్ ఓయూ అధ్యక్షుడు లెనిన్తో కలిసి మాట్లాడుతూ.. రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్ షిప్ బకాయిలు విడుదల చేయడానికి నిధులు ఇవ్వకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే విద్యార్థులు విద్యాభ్యాసం ఎట్లా అని ప్రశ్నించారు. ఫీజు బకాయిల విడుదలపై ప్రభుత్వం చేస్తున్న జాప్యం సరికాదని అన్నారు. ఈ సందర్భంగా ధర్నా చేస్తున్న నాయకులను పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి బండ్లగూడ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.ఈ కార్యక్రమంలో అరెకంటి భగత్, కాంపల్లి కళ్యాణ్, అశ్విన్, ఉదయ్, పవన్, జ్ఞానేశ్వర్, ప్రవీణ్, వినయ్, తదితరులు పాల్గొన్నారు.
మన్సూరాబాద్: ఫీజు రీయింబర్స్మెంట్ పథకం పట్ల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారని ఏఐవైఎఫ్ రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి పి. శివకుమార్‌గౌడ్ తెలిపారు. పెండింగ్‌లో ఉన్న రూ. 7700 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు, ఉపకార వేతనాలను వెంటనే విడుదల చేయాలని కోరుతూ బుధవారం ఏఐవైఎఫ్ రంగారెడ్డి జిల్లా సమితి ఆధ్వర్యంలో ఎల్బీనగర్లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు.
ఈ సందర్భంగా శివకుమార్‌గౌడ్ మాట్లాడుతూ.. రీయింబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వమే.. ఇప్పుడు ఈ పథకానికి తూట్లు పొడుస్తుందన్నారు. కార్యక్రమంలో ఏఐవైఎఫ్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు టి.మధు, ఆఫీస్ బేరర్స్ వెంకటేశ్, శివ, వీరేశ్, నాయకులు సంజీవ, నాగరాజు, గణేశ్, భానుప్రకాశ్, గండికోట శివ, మోహన్, బాబు, వెంకటేశ్, చిరంజీవి, సీహెచ్ రాజు, తదితరులు పాల్గొన్నారు.