ఉస్మానియా యూనివర్సిటీ, జనవరి 23 : ఉస్మానియా యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ (ఔటా) అధ్యక్షుడు ప్రొఫెసర్ మనోహర్ సస్పెన్షన్‌ను తక్షణమే ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ ఓయూ సైన్స్ కళాశాల విద్యార్థులు వివిధ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థి నేతలు మాట్లాడుతూ వర్సిటీ వీసీ అకారణంగా, నియంతృత్వ ధోరణితో ప్రొఫెసర్‌ను సస్పెండ్ చేశారని మండిపడ్డారు. ప్రజాస్వామ్యబద్ధంగా అధ్యాపకుల హక్కుల పరిరక్షణ కోసం శాంతియుతంగా కార్యక్రమాలు నిర్వహించిన ప్రొఫెసర్‌పై సస్పెన్షన్ వేటు వేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.
ఇది కేవలం ఒక వ్యక్తిపై తీసుకున్న చర్య కాదని.. యూనివర్సిటీల్లో ప్రశ్నించే గొంతులను అణిచివేయాలనే ధోరణితో పాలకుల కుట్రగా దానిని అభివర్ణించారు. వర్సిటీలో ఇప్పటికే తీవ్రమైన అధ్యాపకుల కొరతతో విద్యాబోధన అస్తవ్యస్తంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. వీసీ తీసుకున్న నియంతృత్వ నిర్ణయాన్ని వెంటనే రద్దు చేసి, సస్పెన్షన్‌ను తక్షణమే ఉపసంహరించుకోవాలని కోరారు. లేనిపక్షంలో అధ్యాపకులతో కలిసి రాష్ట్రవ్యాప్త ఉద్యమాన్ని చేపడతామని హెచ్చరించారు.