సిటీబ్యూరో, ఏప్రిల్ 23(నమస్తే తెలంగాణ): విద్యార్థులే టార్గెట్‌గా మత్తు పదార్థాల దందా హైదరాబాద్‌లో జోరుగా సాగుతున్నది. ఇటీవల కాలంలో హైదరాబాద్ కమిషనరేట్ పోలీసుల దాడుల్లో ఈ- సిగరెట్ల విక్రయాలు నిరంతరం బయటపడుతున్నాయి. పాన్ డబ్బాలు, బేకరీలు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లే కాకుండా ఇప్పుడు విక్రయదారులు మరో అడుగు ముందుకేశారు. వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ వేదికగా ఆర్డర్లు తీసుకుని సరఫరా చేస్తున్నట్లు పోలీసుల దర్యాప్తుల్లో తేలింది. సాఫ్ట్వేర్ ఉద్యోగులు, కాలేజీ, స్కూల్ విద్యార్థులు కస్టమర్లు కావడం.. అందులోనూ విద్యార్థులే ప్రధాన టార్గెట్‌గా చేసుకుని వ్యాపారం చేస్తున్నారు. పెద్ద మొత్తమైతే హవాళా, చిన్న మొత్తమైతే ర్యాపిడో, ఊబర్ తదితర సర్వీసులు, అంతకంటే తక్కువైతే యూపీఐ పేమెంట్లలో డబ్బులు తీసుకుంటూ తెలివిగా పోలీసుల నుంచి తప్పించుకుంటున్నారు.
హైదరాబాద్ నగరంలో ఈ-సిగరెట్ల విక్రయాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. నిషేధిత ఈ-సిగరెట్లను విక్రయదారులు పలు రూపాల్లో ఆర్డర్లుగా తీసుకుని అమ్మకాలు చేస్తున్నారు. ఇవి ఎక్కువగా ఢిల్లీ, ముంబై నుంచి హైదరాబాద్‌కు తీసుకువస్తున్నారు. కొరియర్/ప్రైవేట్ ట్రాన్స్‌పోర్టు వాహనాల్లో తీసుకొచ్చి పాన్‌షాపులు, హుక్కా పార్లర్లు, బేకరీలలో వాటిని అమ్ముతున్నారు. వాటిని కొత్తవాళ్లకు కాకుండా.. తరచూ తీసుకునే కస్టమర్లకు మాత్రమే ఇవి ఇస్తారు.
కళాశాల విద్యార్థులతో పాటు సాఫ్ట్వేర్ ఉద్యోగులకు వాటిని విక్రయిస్తున్నారు. కొన్నిచోట్ల పాఠశాలలకు చెందిన విద్యార్థులు కూడా వీటికి బానిసలయ్యారని పోలీసులు గుర్తించారు. ఇదంతా అప్పుడప్పుడు నామమాత్రంగా పోలీసుల దృష్టి మరల్చడానికి నిందితుల పన్నాగం కాగా.. అసలు విక్రయాల దందా తీరు మారిపోయింది. ఈ-సిగరెట్లను విక్రయించే విధానంలో ఇప్పుడు నిందితులు మరో అడుగు ముందుకేశారు. టెక్నాలజీని వాడుకుని అడ్వాన్స్‌గా వాట్సాప్ వంటి సోషల్‌మీడియా గ్రూపుల ద్వారా ఆర్డర్లు తీసుకుంటున్నారు. స్కూళ్లు, కాలేజీల పరిసర ప్రాంతాల్లో అమ్మకాలు చేసిన విక్రయదారులు ఇప్పుడు గప్‌చుప్‌గా వాట్సాప్ గ్రూపుల ద్వారా ఈ విక్రయాలు చేపట్టారని, ఆర్డర్లు తీసుకుని తెలిసిన వ్యక్తికి కావాల్సినన్ని సిగరెట్లు సప్లై చేస్తున్నట్లు తెలుస్తున్నది.
ఇవి కూడా బల్క్‌గా ఒకేసారి తీసుకోవాలని, వారం రోజులకోసారి మాత్రమే తాము సప్లై చేస్తామని విక్రయదారులు చెప్పి వారి అలవాటును ఆసరాగా చేసుకుని కొన్నిచోట్ల బ్లాక్‌లో కూడా విక్రయిస్తున్నట్లు పోలీసుల పరిశీలనలో తేలింది. అంతగా ఈ- సిగరెట్లకు అలవాటుపడ్డ విద్యార్థులు సిటీలోని కొన్ని సబ్వేలలో బహిరంగంగానే ఈ-సిగరెట్లు తాగుతున్నట్లు పోలీసులు గ్రహించారు . ప్రస్తుతం ఆయా ప్రాంతాలపై పోలీసులు నిఘా పెట్టారు.
స్కూల్ విద్యార్థులకు నిషేధిత ఈ-సిగరెట్లు అమ్ముతున్న ఇద్దరు అన్నదమ్ముళ్లు సాదిక్ లలానీ, అనిల్ లలానీలను పోలీసులు అరెస్ట్ చేశారు. స్కూళ్ల వద్ద ఈ-సిగరెట్లు అమ్ముతున్నారన్న పక్కా సమాచారంతో సిటీలోని పలు ప్రాంతాల్లో నిఘా పెట్టారు. అబిడ్స్‌లోని లిటిల్ ఫ్లవర్ స్కూల్, సెయింట్ మేరీస్ జూనియర్ కాలేజీ, సెయింట్ జార్జ్ గ్రామర్ స్కూల్, రోసారీ కాన్వెంట్ స్కూల్, సుజాత హైస్కూల్ వద్ద మూడురోజులుగా పోలీసులు గస్తీ కాశారు. ఈ సమయంలోనే ఈ- సిగరెట్లు అమ్ముతున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెలుగుచూశాయి.
ఈజీ మనీ కోసం మైనర్లను టార్గెట్ చేసుకున్న ఈ ఇద్దరు సిద్ అనే వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి అందులో విద్యార్థులను యాడ్ చేశారు. ఎప్పటికప్పుడు కొత్త ప్రొడక్ట్స్‌ను పరిచయం చేస్తూ అమ్మకాలు చేస్తున్నారు. వీటిని కొనుగోలు చేసేందుకు విద్యార్థులు యూపీఐ పేమెంట్స్ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితులు ఈ-సిగరెట్స్, వేప్స్ను ఢిల్లీకి చెందిన అమిత్, ముంబైకి చెందిన వసీం దగ్గర కొనుగోలు చేసి హైదరాబాద్‌లో విక్రయిస్తున్నారు.
పెద్ద మొత్తంలో రూ.50వేలకు పైగా అమ్మకాలు ఉంటే హవాలా ఆపరేటర్స్ నుంచి, రూ.5వేలకు తక్కువగా ఉంటే ఊబర్, ర్యాపిడోలతో పాటు కొన్ని కొరియర్ సర్వీసులను వినియోగిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఇక రెండువేలకు తక్కువ కాకుండా కొనుగోలు చేయాలని, అదే మొత్తమైతే యూపీఐ పేమెంట్స్ ద్వారా తీసుకుంటున్నారని పోలీసులు గుర్తించారు. ఈ-సిగరెట్లు వాడుతున్న 13 మంది మైనర్లను పోలీసులు గుర్తించారు. అలాగే సిద్ గ్రూపులో 500 మంది సభ్యులున్నారని, వారి వివరాలు సేకరించి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇస్తామని పోలీసులు చెప్పారు.
ఈ-సిగరెట్లు కానీ, మత్తు పదార్థాలు కానీ ఏవి అమ్మినా, వాడినా జువైనల్ జస్టిస్ యాక్ట్ కింద కేసు నమోదు చేస్తామని, వారిపై కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అందులో ప్రత్యేకంగా పాఠశాలలున్న పరిసరాల్లో ఇలాంటి పనులకు అడ్డాలుగా మారుతున్న హోటల్స్, షాపులపై చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు.
పిల్లలపై తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు ఓ కన్నేసి ఉంచాలని, వారి ప్రవర్తనలో మార్పు వస్తే కనిపెట్టాలని, విద్యా సంస్థల్లో కూడా ఉపాధ్యాయులు విద్యార్థుల ప్రవర్తనపై దృష్టిపెట్టాలని పోలీసులు సూచించారు. పిల్లల బంగారు భవిష్యత్‌ను నాశనం చేస్తున్న ఇలాంటి మత్తు పదార్థాల విషయంలో సహించేది లేదని, సోషల్‌మీడియా వేదికగా ఆర్డర్లు తీసుకుంటున్నట్లు తమ విచారణలో తేలిందని, ఆయా గ్రూపులు, వాటి అడ్మిన్లపై కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు.