మెహిదీపట్నం: బావతో ప్రేమ వ్యవహారం నడిపి గర్భం దాల్చిన ఇంటర్ రెండో సంవత్సరం విద్యార్థిని శిశువుకు జన్మనిచ్చింది. విషయం బయటపడకుండా శిశువును మూడో అంతస్తు పై నుంచి విసిరివేయడంతో నవజాత శిశువు మృతి చెందింది. మృతదేహాన్ని గమనించిన హాస్టల్ సిబ్బంది గోల్కొండ పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ ఘటన మంగళవారం జరగగా బుధవారం వెలుగులోకి వచ్చింది. శిశువు మృతికి కారణమైన సదరు యువతిపై హత్య కేసు నమోదు చేశామని గోల్కొండ ఇన్స్పెక్టర్ సైదులు తెలిపారు. జగద్గిరిగుట్టకు చెందిన యువతి(19), తన బావ రఘుకమార్(23)తో గత ఏడాది కాలంగా ప్రేమ వ్యవహారం నెరుపుతున్నది. ఈక్రమంలో గర్భం దా ల్చింది.
ఈమె గోల్కొండ బడాబజార్లో ఉన్న ఓ హాస్టల్లో ఉంటూ ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్నది. ఈమె మంగళవారం తెల్లవారుజామున తాను ఉంటున్న హాస్టల్ బాత్రూంలో ఓ మగబిడ్డకు జన్మనిచ్చింది. ప్రసవం కాగానే భయపడ్డ యువతి ఏం చేయాలో తోచక మూడో అంతస్తు పై నుంచి నవజాత శిశువును బయటకు పడేసింది. తీవ్రగాయాలైన ఆ శిశువు మృతి చెందింది. ఉదయం 9 గంటలకు హాస్టల్ సిబ్బంది ఇది గమనించి గోల్కొండ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు హాస్టల్కు వచ్చి ఘటనపై విచారణ చేపట్టారు. ప్రస్తుతం ఆ యువతి నీలోఫర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నదని, ఆమె పరిస్థితి నిలకడగా ఉందని పోలీసులు చెప్పారు. కేసు దర్యాప్తులో ఉంది.