హయత్‌నగర్, ఫిబ్రవరి 6 : స్కూల్ వ్యాన్ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఓ విద్యార్థిని మృతిచెందింది. మరో విద్యార్థినికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ హృదయ విదారక సంఘటన హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వనపర్తి జిల్లా, చిన్నంబావి మండలం, అయ్యవారిపల్లి గ్రామానికి చెందిన బొబ్బిలిగామ నర్సింహ, శ్రీలత దంపతులకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. బతుకుదెరువు కోసం నగరానికి వచ్చి అబ్దుల్లాపూర్‌మెట్ మండలం, పెద్దఅంబర్‌పేట మున్సిపాలిటీ, హనుమాన్ హిల్స్‌లో నివాసముంటున్నారు. నర్సింహ స్థానికంగా లారీ మెకానిక్ పనులు చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్నారు.
హయత్‌నగర్‌లోని శ్రీచైతన్య స్కూల్లో ఆయన పెద్ద కుమార్తె అనన్య(6) ఎల్కేజీ, చిన్న కుమార్తె రిత్విక(4) నర్సరీ చదువుతున్నారు. రోజూ మాదిరిగానే వారు స్కూల్ వ్యాన్ నెం.(టీఎస్ 18 టీ 1071)లో బడికి వెళ్లారు. సాయంత్రం స్కూల్ ముగియగానే స్కూల్ వ్యానులో ఇంటికి చేరుకున్న విద్యార్థినులను డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా రివర్స్ తీసే క్రమంలో ఢీకొట్టాడు. రిత్విక కిందపడడంతో టైరు తలపైనుండి వెళ్లింది. అనన్య ఎగిరిపడడంతో స్వల్పంగా గాయపడింది. వెంటనే తేరుకున్న స్థానికులు రిత్వికను హుటాహుటిన స్థానిక ఆస్పత్రికి తరలించారు. బాలికను పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లుగా నిర్ధారించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
బీఆర్ఎస్, సీపీఐ, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన..
హయత్‌నగర్‌లోని శ్రీచైతన్య స్కూల్ ఎదుట బీఆర్ఎస్, సీపీఐ, ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో మృతిచెందిన విద్యార్థిని కుటుంబ సభ్యులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి రాకముందే పోలీసులు అత్యుత్సాహంతో మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించడం ఏమిటని ఆందోళనకారులు ప్రశ్నించారు. బాధిత కుటుంబాన్ని ఆదుకోని న్యాయం చేసి సదరు డ్రైవర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.