మన్సూరాబాద్, ఆగస్టు 31: దివ్యాంగుల హాస్టల్లో సరైన వసతులు లేక ఉజ్వల భవిష్యత్తు ఉన్న ఓ విద్యార్థి జీవితం అర్ధాంతరంగా ముగిసిపోయింది. హాస్టల్లో సరైన వసతులు, సహాయకులు లేక పోవడం వల్లే విద్యార్థి మృతి చెందాడని విద్యార్థులు ఆరోపించారు. మన్సూరాబాద్ డివిజన్ పరిధి శైలజాపురి కాలనీలోని దివ్యాంగుల వసతి గృహంలో సుమారు 60 మంది విద్యార్థులు ఉంటున్నారు.
విద్యార్థులు హాస్టల్లో ఉంటూ సమీప కళాశాలలు, పాఠశాలల్లో ఉన్నత చదువులు చదువుకుంటున్నారు. మరి కొందరు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారు. కాగా రంగారెడ్డి జిల్లా, మాడ్గుల మండలం, నల్లవారిపల్లె గ్రామానికి చెందిన ఆమె జగన్ (26) డిగ్రీ పూర్తి చేశాడు. జగన్ తండ్రి రామచంద్రయ్య సంవత్సరం క్రితం, తల్లి పెంటమ్మ మూడేండ్ల కింద చనిపోయారు. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ అన్నింటిని అధిగమిస్తూ పుట్టెడు దుఃఖంలో ఉండి సైతం తన లక్ష్యాన్ని అందుకునే దిశగా ముందుకు సాగిన జగన్ గ్రూప్స్‌కు క్వాలిఫైడ్ అయ్యాడు.
శనివారం ఉదయం 8:30 గంటలకు స్నానం చేసేందుకు వెళ్లిన జగన్ బాత్రూమ్లో అపస్మారక స్థితిలో పడి పోయాడు. గమనించిన విద్యార్థులు అతడిని చికిత్స నిమిత్తం వనస్థలిపురం ఏరియా ఆస్పత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. పదిహేను నిమిషాల ముందు తీసుకువచ్చినట్లయితే జగన్‌కు ప్రాణాపాయం తప్పేదని వైద్యులు తెలిపారు. శ్వాస అందకపోవడంతోనే జగన్ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారని విద్యార్థులు పేర్కొన్నారు. విద్యార్థి అంత్యక్రియలను ఆటోనగర్‌లోని శ్మశానవాటికలో నిర్వహించారు.
శైలజాపురికాలనీలోని దివ్యాంగుల వసతి గృహంలో సరైన సదుపాయాలు లేక పోవడం వల్లే ఎంతో ఉన్నత భవిష్యత్తు ఉన్న దివ్యాంగ విద్యార్థి జగన్ మృతి చెందినట్లు తోటి విద్యార్థులు ఆరోపించారు. వార్డెన్, నర్సు రోజులో గంట పాటు వచ్చి వెళ్తారని, హాస్టల్లో వాచ్మెన్ లేడని తెలిపారు. దివ్యాంగులు ఉండే రెండంతస్తుల భవనంలో ఎవరైనా ప్రమాదవశాత్తు కాలు జారి పడిపోతే ఆదుకునే సిబ్బంది ఎవరూ లేరని తెలిపారు. జగన్ బాత్రూమ్లో స్పృహ తప్పి పడిపోయినప్పుడు ఎవరూ గమనించలేదని, దివ్యాంగ విద్యార్థుల కోసం సహాయకులు ఉండి ఉంటే పరిస్థితి మరో లాగా ఉండేదన్నారు.
దివ్యాంగ విద్యార్థుల ఆరోగ్యాల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే జగన్‌ను కోల్పోవల్సి వచ్చిందని చెప్పారు. జగన్ బాత్రూమ్లో పడిపోయినప్పుడు గమనించకపోవడం.. సమయానికి రవాణా సౌకర్యం, దివ్యాంగులమైన తమకు సహకరించేందుకు సిబ్బంది లేకపోవడంతో మిత్రుడిని కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. దివ్యాంగులకు హెల్త్ చెకప్‌లు చేయించాలని ఎన్నో పర్యాయాలు విద్యాశాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయిందన్నారు.