China Manja | సిటీబ్యూరో/చార్మినార్: చైనా మాంజాలు మనిషులతో పాటు జంతువులు, పక్షుల ప్రాణాలు తీస్తున్నాయి. గతేడాది చైనా మాంజా తగిలి ఆర్మీ జవాన్ మృతి చెందిన విషాదకర ఘటనతో ఈ సారి ట్రై పోలీస్ కమిషనరేట్ల పరిధిలో వాటి విక్రయాలను పూర్తిస్థాయిలో అడ్డుకోవాల్సి ఉంది. అయితే నగరంలో ఇప్పుడిప్పుడే పోలీసులు ఈ విషయంపై దృష్టి పెట్టి స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. శుక్రవారం ఓల్డ్‌సిటీలో టాస్క్‌ఫోర్స్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి 14 కేసులు నమోదు చేశారు. అయితే ఇప్పటికే కొందరు వ్యాపారులు చైనా మాంజాల విక్రయాలు ప్రారంభించడంతో ప్రజలు కొనుగోలు చేశారు. నగరంలోకి ఈ మాంజాలు రాకుండా ముందుగానే పూర్తిస్థాయిలో నిఘా పెట్టాల్సింది.
గుజరాత్, మహారాష్ట్ర, ఢిల్లీ తదితర ప్రాంతాల నుంచి ఈ చైనా మాంజాలు హైదరాబాద్‌కు సరఫరా అవుతుంటాయి. సంక్రాంతి సీజన్ వస్తుందంటే పోలీసుల ముందుచూపుతో నిఘా పెట్టాల్సిన అవసరం ఎంతో ఉంటుంది. పోలీసులు జనవరి నెల ప్రారంభమయ్యిందంటే తమపై దృష్టి సారిస్తారని కొందరు వ్యాపారులు డిసెంబర్ నెలలోనే ఆయా ప్రాంతాల నుంచి చైనా మాంజాలను తెచ్చి అమ్మకానికి సిద్ధం చేసుకున్నట్లు వ్యాపార వర్గాల్లో చర్చ జరుగుతున్నది.ఇలాంటి ఓ మోస్తరు వ్యాపారుల నుంచి బస్తీలు, కాలనీల్లో ఉండే చిరు వ్యాపారుల వద్దకు కూడా చైనా మాంజాలు విక్రయానికి వెళ్లాయి. కొందరు యువకులు, పిల్లలు సైతం ఈ మంజాలను కొనుగోలు చేశారు. ఈ సారి పూర్తిస్థాయిలో చైనా మాంజాలు నగరంలో విక్రయాలు జరగకుండా అడ్డుకుంటారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. చైనా మాంజాలతో విషాదాలు..
చైనా మాంజాలు వాడుతుండడంతో అవి మనిషుల ప్రాణాలు తీసేస్తున్నాయి. గత నాలుగైదేండ్లుగా చైనా మాంజాల నుంచి ప్రమాదాలు చోటు చేసుకుంటూ వస్తున్నాయి. గత ఏడాది ఆర్మీ జవాన్ కోటేశ్వర్‌రెడ్డి లంగర్ హౌస్ ఫ్లైవోర్పై ద్విచక్రవాహనంపై వెళ్తుండగా, అకస్మాతుగా గొంతుకు చైనా మాంజా తగిలి ప్రాణాలు కోల్పోయారు. ఇలాంటి ఘటనలు ప్రతి ఏటా ఎక్కడో ఒక చోట జరుగుతూ వస్తుండడంతో ట్రై పోలీస్ కమిషనరేట్లలో ఈ సారి ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నారు.
చైనా మాంజాలను విక్రయించడంపై ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమయ్యారు. అయితే హోల్‌సెల్‌గా ఇతర రాష్ర్టాల నుంచి ఈ మాంజాలను తేవడాన్నే అడ్డుకట్ట వేస్తే సమస్యను పూర్తిగా అణిచివేసేందుకు అవకాశముంటుండేదని నగర వాసులు భావిస్తున్నారు. గత ఏడాది ఆర్మీ జవాన్ మృతి ఘటనతో పోలీసులు విస్త్రతంగా దాడులు నిర్వహించి, 40 మందికిపై ఇలాంటి వ్యాపారులపై కేసులు నమోదు చేశారు. గత ఏడాది, అంతకు ముందు ఏడాది పట్టుబడ్డ వాళ్లు, కొత్తగా ఈ వ్యాపారంలోకి వచ్చిన వారెవరు అనే విషయాన్ని ముందుగానే గుర్తించి కట్టడి చేస్తే నగరానికి చైనా మాంజాలు వచ్చేందుకు అవకాశాలు తక్కువగా ఉండేవి.
పర్యావరణంతోపాటు పక్షులకు, ప్రజలకు ప్రమాదకరంగా మారిన చైనా మాంజా అమ్మకాలపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు శుక్రవారం స్థానిక పోలీసులతో కలిసి సంయుక్తంగా దాడులు నిర్వహించినట్లు టాస్క్‌ఫోర్స్ అదనపు డీసీపీ అందె శ్రీనివాస్ తెలిపారు. అసీఫ్‌నగర్, సైదాబాద్, బహుదురుపుర, మాదన్నపేట, కాచిగూడ, మీర్‌చౌక్, మెఘల్‌పురా, చిలకలగడూ, ఉస్మానియా యూనివర్సిటీ, శాహినాత్గంజ్, నారాయణగూడ పోలీస్స్టేషన్ల పరిధిలోని మాంజా విక్రయాలు చేస్తున్న 14 మందిపై కేసులు నమోదు చేసి, అమ్మకాలకు 987 చైనా మాంజా బండిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రజలు సైతం స్వీయ నియంత్రణ పాటిస్తూ పక్షులకు, పర్యావరణానికి, ప్రజలకు ప్రమాదకరంగా మారిన ఈ చైనా మాంజాలను కొనుగోలు చేయవద్దని, ఎవరైనా విక్రయిస్తే సమాచారం ఇవ్వాలని సూచించారు.