సిటీబ్యూరో, నవంబర్ 8 (నమస్తే తెలంగాణ): అనుమతి లేకుండా అక్రమంగా నార్కొటిక్, సైకొట్రోపిక్ సబ్స్టెన్సెస్ డ్రగ్స్ విక్రయిస్తున్న నగరంలోని పలు దవాఖానలపై డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు, అబ్కారీ అధికారులతో కలిసి దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పెద్ద ఎత్తున కెటమైన్, ఫెంటనైల్ ఇంజక్షన్స్ నిలువలను సీజ్ చేశారు. డీసీఏ డీజీ, అబ్కారీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వి.బి.కమలాసన్‌రెడ్డి కథనం ప్రకారం… నగరంలోని కొన్ని ప్రైవేటు దవాఖానల్లో అనుమతి లేకుండా నార్కొటిక్, సైకొట్రోపిక్ సబ్స్టెన్సెస్ ఔషధాలు విక్రయిస్తున్నారు. క్లినికల్‌గా వినియోగించే ఈ ఔషధాలు విక్రయించాలంటే కచ్చితంగా డీసీఏ నుంచి ఎన్డీపీఎస్ లైసెన్స్ తీసుకోవాలి.
కానీ, నగరంలోని కొన్ని దవాఖానల నిర్వాహకులు నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి అనుమతులు లేకుండానే ఈ డ్రగ్స్‌ను విక్రయిస్తున్నారు. ఈ మేరకు సమాచారం అందుకున్న డీసీఏ అధికారులు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారులతో కలిసి చాంద్రాయణగుట్ట ప్రాంతంలోని బకోబన్ హాస్పిటల్, సికింద్రాబాద్, బౌద్ధనగర్‌లోని బీవీకే రెడ్డి హాస్పిటల్స్‌పై దాడులు జరిపారు. ఈ దాడుల్లో బకోబన్ హాస్పిటల్లో అక్రమంగా నిలువ చేసిన 47 ఫెంటనైల్ సిట్రేట్ ఇంజక్షన్ ఆంపిల్స్ను సీజ్ చేసి, దవాఖాన యజమాని అబ్దుల్ రహ్మాన్‌పై చార్మినార్ ఎక్సైజ్ స్టేషన్లో కేసు నమోదు చేశారు.
బీవీకే రెడ్డి హాస్పిటల్లో 21ఆంపిల్స్ ఫెంటనైల్ సిట్రేట్ ఇంజక్షన్స్, 9 కెటమైన్ హైడ్రోక్లోరైడ్ ఇంజక్షన్ వయల్స్, 2 మిడజోలం ఇంజక్షన్ వయల్స్‌ను సీజ్ చేసి, బీవీకే రెడ్డి హాస్పిటల్‌కు చెందిన టి.నరేశ్‌కుమార్‌పై ముషీరాబాద్ ఎక్సైజ్ పోలీసులు కేసు నమోదు చేశారు. డీసీఏ డీజీ కమలాసన్‌రెడ్డి ఆదేశాల మేరకు జరిగిన ఈ దాడుల్లో చార్మినార్ డ్రగ్ ఇన్స్పెక్టర్ బి.లక్ష్మి, సికింద్రాబాద్ డ్రగ్ ఇన్స్పెక్టర్ బి.గోవింద్‌సింగ్, చార్మినార్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ జి.శ్రీనివాస్‌రావు, ముషీరాబాద్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ డి.రామకృష్ణ, ఎస్ఐలు కె.శ్వేతాకుమారి, కె.ప్రసన్న రెడ్డి, నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
ఎన్డీపీఎస్ అనుమతి లేకుండా దవాఖానల్లోగాని లేదా మెడికల్ షాపుల్లోగాని మత్తు ఇంజక్షన్లు విక్రయించడం నేరం. క్లినికల్‌గా వినియోగించే ఈ మత్తు ఇంజక్షన్లను కేవలం అనుభవజ్ఞులైన వైద్యులు మాత్రమే రోగి ఆరోగ్య పరిస్థితి ఆధారంగా ఇవ్వాల్సి ఉంటుంది. ఈ మత్తు ఇంజక్షన్లు మోతాదు ఏమాత్రం ఎక్కువైనా వాటిని తీసుకున్నవారు మృతిచెందే ప్రమాదం ఉంది. అందుకని అనుమతి లేకుండా ప్రజల ప్రాణాలకు హాని కలిగించే విధంగా మత్తు ఇంజక్షన్లు విక్రయించే వారిపై చట్టరీత్య కఠిన చర్యలు తప్పవు.