సిటీబ్యూరో, డిసెంబర్ 5(నమస్తే తెలంగాణ ): గ్రేటర్ హైదరాబాద్ వాసులకు జీహెచ్ఎంసీ అందించే పౌర సేవల నిర్వహణలో స్ట్రీట్ లైట్ల నిర్వహణ చాలా కీలకం. అయితే గడిచిన రెండేండ్లుగా వీధి లైట్ల నిర్వహణ విషయంలో అధికారుల డొల్లతనం వెలుగు చూస్తున్నది.నిత్యం రద్దీగా ఉండే మెయిన్ రోడ్లలో స్ట్రీట్‌లైట్లు సక్రమంగా వెలగడం లేదు..దీని కారణంగా ప్రమాదాలు సంభవిస్తుండ డమే కాదు జనాల్లో దొంగల భయం వెంటాడుతున్నది.
ఈ క్రమంలోనే కార్పొరేటర్లతో పాటు పౌరులు వీధి లైట్లు వెలగడం లేదంటూ జీహెచ్ఎంసీ టోల్ ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదులు భారీ సంఖ్యలో వస్తుండడమే ఇందుకు నిదర్శనం. వీధి దీపాల నిర్వహణ బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఈఈఎస్ఎల్ గడువు ముగిసి ఎనిమిది నెలలు దాటినా కొత్త ఏజెన్సీని ఖరారు చేయలేదు. అంతేకాదు ఏడేండ్ల పాటు ఈఈఎస్ఎల్ (ఎనర్జీ ఎఫీషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్)కు వీధి దీపాల ఏర్పాటు, నిర్వహణ పేరిట చెల్లించిన నిధుల్లో దాదాపు రూ. 13 కోట్ల అవినీతి జరిగాయనే ఆరోపణలు ఉన్నప్పటికీ సదరు ఏజెన్సీపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు.కొత్త ఏజెన్సీ నియమించే వరకు నిర్వహణపై ప్రజలతో పాటు కార్పొరేటర్ల నుంచి విమర్శలు వెల్లువెత్తడంతో ఈనెలలోనే జోన్‌కు రూ. 4 కోట్ల చొప్పున రూ. 24 కోట్లు కేటాయించారు.
ప్రస్తుతం జీహెచ్ఎంసీ నిర్వహణ బాధ్యతలు నిర్వర్తిస్తుండగా.. ఉన్నతా ధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో గ్రేటర్లో చాలా ప్రాంతాల్లో అంధకారం నెలకొంది. ఈ క్రమంలోనే ఐదు లక్షలకు పైగా ఉన్న వీధి దీపాల్లో దాదాపు 35 శాతానికి పైగా వీధి దీపాలు వెలగడం లేదు. కాగా అంధకారంలో ఉన్న ప్రాంతాల్లో వాహన ప్రమాదాలు, దొంగల బెడద పట్ల జనాల్లో భయాందోళన నెలకొంది.
– ఫీచర్స్ స్టోరీ
