పాఠశాలకు సెలవు ఇవ్వడంతో సికింద్రాబాద్ ఏరియాలో కొందరు పిల్లలు బయట ఆడుకుంటున్నారు. అందులో ఎనిమిదో తరగతి చదువుతున్న శివకేశవ్‌పై రెండు వీధి కుక్కలు విరుచుకుపడ్డాయి. కాళ్ల భాగంలో కరవడంతో తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకుపోవడంతో చికిత్స అనంతరం కోలుకున్నాడు..
ఇలా నగరంలో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. దొరికిన వారిని దొరికినట్లు కరుస్తున్నాయి. దీనికితోడు ఎండాకాలం కావడంతో ఇరిటేషన్ పెరిగి మరింతగా విరుచుకుపడుతున్నాయి. ఫలితంగా గ్రేటర్ పరిధిలో రోజురోజుకు కుక్కకాటు బాధితులు పెరిగిపోతున్నారు. ఒక్క ఫీవర్ ఆసుపత్రిలోనే రోజుకు పదుల సంఖ్యలో బాధితులు వస్తుండటం ఆందోళన కలిగించే అంశం.
నెల రోజుల కిందట గ్రేటర్లో మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తిని వీధి కుక్క కరిచింది. ఏమవుతుందిలే.. అని అతడు నిర్లక్ష్యం చేశాడు. ఇంట్లో వాళ్లకు చెప్పలేదు… వైద్యశాలకు పోలేదు.. కనీసం ప్రథమ చికిత్స కూడా చేయించుకోలేదు… అది ఇన్ఫెక్షన్కు దారి తీసి.. చివరకు అతడు రేబిస్‌తో చనిపోయాడు.
సిటీబ్యూరో, ఏప్రిల్12 (నమస్తే తెలంగాణ): నగరంలో వీధి కుక్కలు దడపుట్టిస్తున్నాయి.. రోజురోజుకు కుక్కకాటు బాధితులు పెరిగిపోతుండటం ఆందోళన కలిగిస్తున్నది. చిన్నా..పెద్దా తేడాలేకుండా.. దాడి చేస్తున్నాయి. గతేడాది ఏప్రిల్, మే, జూన్ ప్రారంభ సమయానికి 2,700 మంది బాధితులు కుక్కకాటుతో ఫీవర్ ఆసుపత్రిలో చికిత్స పొందగా, వారం రోజులుగా ఫీవర్ ఆసుపత్రికి కుక్కకాటుకు గురై సుమారు 600 మంది చికిత్స కోసం రావడం ఆందోళన కలిగించే అంశం. కాగా, గ్రేటర్లో 2023లో రేబిస్ వ్యాధి సోకి 13 మంది మరణించగా, 2024లో 24 మంది చనిపోయారు.
ఉష్ణోగ్రతలు పెరగడంతో..
ఎండాకాలంలో ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల కుక్కల్లో విపరీతమైన ఇరిటేషన్ వచ్చి, దూప ఎక్కువై స్వైరవిహారం చేస్తాయని వైద్యులు తెలిపారు. ఈ క్రమంలో ఆగ్రహంతో ఎవరూ కనిపించినా.. వారి మీద దాడి చేసేందుకు ప్రయత్నిస్తాయని చెప్పారు. ఇరిటేషన్ కారణంగా కుక్కల్లో కరిచే గుణం పెరుగుతుందన్నారు.
వీధి కుక్కలు, పెంపుడు కుక్కలు రెండూ కూడా కరిచే స్వాభావం కలవేనని, అయితే పెంపుడు కుక్కలకు వ్యాక్సినేషన్‌తో సహా ఎప్పటికప్పుడు ఆహారం, నీళ్లు ఇవ్వడంతో వాటి నుంచి ప్రమాదం ఉండటం లేదు. కానీ వీధి కుక్కలకు సరైన సమయంలో ఆహారం, నీళ్లు దొరకక కనిపించిన వారిపై దాడి చేసి, కరుస్తున్నాయి. ప్రధానంగా పిల్లల మీద ఇవి ఎక్కువ ప్రతాపాన్ని చూపుతున్నాయి. గతేడాది అనేకచోట్ల పిల్లలు, మహిళలపై వీధి కుక్కలు దాడి చేశాయి.
Dogs
స్టెరిలైజేషన్ సరిగా జరుగుతుందా?
గ్రేటర్ పరిధిలో 2019 పశుగణన లెక్కల ప్రకారం 51వేల కుక్కలు ఉన్నట్లు గుర్తించారు. కానీ ఆతర్వాత ఇప్పటివరకు గణన జరగలేదు. కానీ వీటి సంఖ్య లక్ష వరకు చేరవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో కుక్కల సంఖ్య ఆధారంగానే ఆస్పత్రుల్లో రేబిస్ వ్యాక్సిన్ నిల్వలు ఉండాలి. కానీ ఆ మేరకు లేవని, అందుకే చాలా మంది ప్రైవేటును ఆశ్రయిస్తున్నట్లు తెలిసింది.
అయితే నగరంలో కుక్కల స్టెరిలైజేషన్ ప్రక్రియ ఎంతమేర పకడ్బందీగా జరుగుతున్నదనే దానిపై వైద్యులే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఒక వీధిలోఉన్న కుక్కను స్టెరిలైజేషన్ చేశామంటూ దానిని మరో వీధిలో వదిలిపెడుతున్న ఉదంతాలు ఉన్నాయని ఫీవర్ ఆస్పత్రికి వచ్చిన బాధితుడి బంధువు ఒకరు చెప్పారు. కాగా, కుక్క కాటుకు గురైన వెంటనే అప్రమత్తమై తగిన జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు వెంటనే ఆస్పత్రికి వెళ్లాలని వైద్యులు సూచిస్తున్నారు. గ్రేటర్ పరిధిలో ఫీవర్ ఆసుపత్రి తోపాటు నారాయణగూడలోని ఐపీఎంలో వ్యాక్సినేషన్ ఇస్తున్నారు.
గతేడాది ఏప్రిల్-జూన్ వరకు ఫీవర్ ఆస్పత్రిలో 2700 కుక్క కాటు కేసులు నమోదవ్వగా, ఏకంగా 24 మంది మృత్యువాతపడ్డారు. ఈసారి కేవలం ఈ నెల 8-11 వరకు అంటే వారం రోజుల వ్యవధిలోనే 603 కేసులు నమోదు కాగా.. రేబిస్ సోకి విషమ పరిస్థితిలో ఫీవర్ ఆస్పత్రికి వచ్చి చనిపోయిన కేసు ఒకటి నమోదైనట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.
కుక్క కరిస్తే వెంటనే ఏం చేయాలి?
నిర్లక్ష్యం చేయకండి..
కుక్క కరిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించండి. లేదంటే రేబిస్వచ్చి ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. ఇంటివద్ద, పనిప్రదేశాల్లో కుక్కలకు దూరంగా ఉండండి. పెంపుడు కుక్కలు సైతం ఇతరులను కరవకుండా యజమానులు జాగ్రత్తలు తీసుకోవాలి.
– డాక్టర్ రాజేంద్రప్రసాద్,ఫీవర్ ఆసుపత్రి సూపరింటెండెంట్