సిటీబ్యూరో, అక్టోబర్ 11 (నమస్తే తెలంగాణ): సచివాలయ పరిసరాల్లో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. ఎక్కడ చూసినా గుంపులు గుంపులుగా సంచరిస్తూ తెలంగాణ సచివాలయ ఉద్యోగులు, సందర్శకులను హడలెత్తిస్తున్నాయి. జీహెచ్ఎంసీ అధికారులు దృష్టి సారించకపోవడంతో వీధికుక్కలు రెచ్చిపోతున్నాయి. ఇటీవల జరిగిన వరుస ఘటనల్లో ఇప్పటి వరకు నలుగురిని కరిచినట్లు తెలుస్తున్నది. కుక్కల భయానికి సచివాలయాన్ని సందర్శించేవారు భయంతో అటువైపు రావడానికి జంకుతున్నారు. ఉద్యోగులు సైతం బిక్కుబిక్కుమంటూ రాకపోకలు సాగిస్తున్నారు.
జీహెచ్ఎంసీ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉన్న సచివాలయంలోనే పరిస్థితి ఇలా ఉంటూ నగర వ్యాప్తంగా కుక్కల బెడద ఎలా ఉంటుందో అర్థం చేసుకోవాలని నగర ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా డైలీ విజిటర్స్ పాస్ కౌంటర్, క్యాంటీన్, మీడియా సెంటర్ పరిసరాల్లో వీధి కుక్కలు పదుల సంఖ్యలో సంచరిస్తున్నాయని సందర్శకులు ఆరోపిస్తున్నారు. నిత్యం మంత్రులు, ఉన్నతాధికారులు వచ్చే సచివాలయ పరిసరాల్లో కుక్కల సంచారాన్ని పట్టించుకోకపోవడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.