చర్లపల్లి, ఏప్రిల్ 10 : కేంద్ర కారాగారంలోని ఖైదీల సంక్షేమానికి తెలంగాణ జైళ్ల శాఖ కృషి చేస్తుందని రాష్ట్ర జైళ్ల శాఖ డీజీ,ఐపీఎస్ డాక్టర్ సౌమ్యమిశ్రా తెలిపారు. చర్లపల్లి కేంద్ర కారాగారంలో నూతనంగా నిర్మించిన జీప్లస్1 బ్యారక్‌ను జైళ్ల శాఖ ఐజీ మురళీబాబు, డీఐజీ డాక్టర్ శ్రీనివాస్, అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఎస్.ఎం. ఖలీద్ అక్తర్‌లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న ఖైదీల సంక్షేమానికి పలు సంస్కరణలు ప్రవేశపెట్టామని, నూతనంగా నిర్మించిన బ్యారక్ నాలుగు సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉండటంతో ప్రత్యేక దృష్టి సారించి ఆరు నెలల వ్యవధిలో నిర్మించి అదుబాటులోకి తీసుకువచ్చామని తెలిపారు.
నూతన బ్యారక్‌లో వసతి సామర్థ్యం పెంచడంతో పాటు సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. కేంద్ర కారాగారంలో పరిశ్రమలను ఏర్పాటు చేసి ఖైదీలకు ఉపాధి కల్పించే విధంగా శిక్షణ ఇస్తున్నామని, అదేవిధంగా నూతనంగా ఐటీఐ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. అనంతరం ఆమె కేంద్ర కారాగారంలోని జైలు గ్రంథాలయం, ఎన్ఐఓఎస్ తరగతి గదులు, ఖైదీల వ్యవసాయక్షేత్రంలో ఖైదీలు పండిస్తున్న పంటలు, సేంద్రియ ఆకు కూరలను పరిశీలించారు. ఖైదీలకు అందిస్తున్న విద్యను ఆమె పరిశీలించి ఖైదీల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో చర్లపల్లి, చంచల్‌గూడ జైలు సూపరెంటెండెంట్లు ప్రమోద్, శివకుమార్గౌడ్లతో పాటు డిప్యూటీ సూపరెంటెండెంట్లు, జైలర్లు, వివిధ విభాగాల అధికారులు తదితరులు పాల్గొన్నారు.