మహానగరంలో ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సొరంగ మార్గాల వైపు వేస్తున్న
అడుగులు ముందుకు సాగేనా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఎందుకంటే..ఆర్థికంగా అంతకంటే తక్కువ ప్రత్యామ్నాయాలు ఉండటం ఒక వంతైతే… చారిత్రక నగరంలో సాంకేతికంగా పెను సవాళ్లతో కూడుకున్న ఈ నిర్మాణాలను చేపట్టడం ఎంత వరకు శ్రేయస్కరం అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనే తెరపైకి వచ్చిన ఈ ప్రతిపాదనలపై అధ్యయనం చేసిన నిపుణుల కమిటీ కేవలం ఆరున్నర కిలోమీటర్ల మేర నిర్మాణాలే సాధ్యం కాదని తేల్చింది.
ఈ నేపథ్యంలో ఏకంగా ఐదు చోట్ల.. అందునా అత్యంత రద్దీగా ఉండే నగరం నడిబొడ్డున 39 కిలోమీటర్ల మేర సొరంగ మార్గాలు ఎలా సాధ్యమవుతాయనే ప్రశ్నలు అధికార యంత్రాంగం నుంచే వినిపిస్తున్నాయి. అయినప్పటికీ సీఎం రేవంత్‌రెడ్డి ఆలోచన కావడంతో అధ్యయనం చేయాలి మరోసారి… అంటూ కన్సల్టెన్సీ ఎంపికపై ముందుకు సాగుతున్నారు.
– సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, ఫిబ్రవరి 22 (నమస్తే తెలంగాణ)
మహా నగరాల్లో ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికిగాను సొరంగ మార్గాలు (టన్నెల్ రోడ్స్) నిర్మించడం సాధారణమే. కాకపోతే ముందుగా రవాణా వ్యవస్థలో భాగంగా ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు, తదితర నిర్మాణాలను చేపడతారు. సమస్య పరిష్కారం కాకపోతే మెట్రో, బీఆర్టీఎస్ ఇలా అనేక రకాల ప్రజా రవాణా వ్యవస్థలను ఏర్పాటు చేస్తారు. ఇవన్నీ సాధ్యం కాకపోతే తప్పని పరిస్థితుల్లో సొరంగ మార్గాలను ఆశ్రయిస్తారని రవాణా వ్యవస్థ నిపుణులు చెబుతున్నారు. ఇప్పటివరకు దేశ రాజధానిలో రెండు కిలోమీటర్ల లోపు సొరంగ మార్గం మినహా మరెక్కడా ఇలాంటి నిర్మాణాలు చేపట్టలేదు.
ప్రస్తుతం సొరంగ మార్గాల నిర్మాణంలో అనుసరించే అత్యాధునిక టన్నెల్ బోరింగ్ మిషన్ (టీబీఎం)తో సుమారు కిలోమీటరు నిర్మాణానికి దాదాపు రూ. వెయ్యి కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా. ఈ క్రమంలో బెంగళూరులో ఎన్హెచ్ఏఐ 60 కిలోమీటర్లకు రూ. 50వేల కోట్ల వరకు ఖర్చవుతుందని ప్రాథమికంగా అంచనా వేసింది. అంటే సొరంగ మార్గాలు అనేవి ఆర్థికంగా భారీ వ్యయంతో కూడుకున్నవిగా అర్థమవుతుంది. ప్రపంచవ్యాప్తంగా మహా నగరాలు ఎక్కువగా అనుసరిస్తున్న మెట్రో రైలు ప్రాజెక్టుల్లో కిలోమీటరుకు రూ. 200 కోట్ల లోపే ఖర్చవుతున్నది. అందుకే ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి మహా నగరాలు ఎక్కువగా మెట్రో వైపే మొగ్గు చూపుతున్నాయి.
రహదారుల కోసం నిర్మించే సొరంగ మార్గాలు మాత్రం వీటి కంటే ఎక్కువగా కనీసంగా ఏడు మీటర్ల డయా ఉంటుంది. సాగునీటి ప్రాజెక్టుల్లో చేపట్టే సొరంగ మార్గాల డయా భారీగా ఉంటుంది. శ్రీశైలం ఎడమ గట్టు కాల్వ ప్రాజెక్టు (ఎస్సెల్బీసీ)లో 11 మీటర్లు, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో 13 మీటర్ల డయాతో సొరంగాలు నిర్మించారు. అయితే సాగునీటి ప్రాజెక్టులంటే అటవీ, మైదాన ప్రాంతాల్లో ఉంటున్నందున సాంకేతికంగా పెద్ద సమస్య ఉండదు. అయితే మహా నగరాల్లో నివాసాలు, ట్రాఫిక్ ఉండే ప్రాంతాల్లో సొరంగ నిర్మాణాలు చేపడతే మాత్రం..సాంకేతికంగా అవి పెను సవాలుతో కూడుకుంటుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
నగరంలోని లిబర్టీ నుంచి నింబోలిఅడ్డా వరకు డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణంలో భాగంగా 1.8 మీటర్ల డయాతో 5 కిలోమీటర్ల మేర సొరంగాన్ని చేపట్టారు. అప్పుడున్న అత్యాధునిక పరిజ్ఞానం ట్రెంచ్‌లెస్ టెక్నాలజీతో 2008లో అప్పటి సీఎం వైఎస్ శంకుస్థాపన చేశారు. 2009 జూలైలో పనులు మొదలైతే.. 2022 వరకు కేవలం నాలుగు కిలోమీటర్లు మాత్రమే పూర్తి చేయగలిగారు. పైగా సంవత్సరాల తరబడి వాహనదారులు ట్రాఫిక్ నరకం అనుభవించారు.
దీంతో అయినంత వరకు చాలనుకొని ఆ ప్రాజెక్టును అక్కడితో ముగించారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో కేబీఆర్ పార్కు వద్ద సొరంగ జంక్షన్ ఏర్పాటు చేసి… జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్ 45 నుంచి జంక్షన్ వరకు (1.7 కిలోమీటర్లు), బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 12 నుంచి జంక్షన్ వరకు (1.1 కిలోమీటరు), జంక్షన్ నుంచి ఎన్ఎఫ్సీఎల్ వరకు జంక్షన్ వరకు (2 కిలోమీటర్లు) ఇలా 6.3 కిలోమీటర్ల ప్రతిపాదనలపై సాధ్యాసాధ్యాలను తేల్చేందుకు కన్సల్టెన్సీకి ఇచ్చారు. నిపుణుల కమిటీ అధ్యయనం చేసి చివరకు నగరంలో సొరంగ మార్గం సాధ్యం కాదని తేల్చి చెప్పారు. దీంతో ఈ ప్రతిపాదనతో పాటు ఐటీసీ కోహినూరు నుంచి రాయదుర్గం చౌరస్తా వరకు ఉన్న మరో ప్రతిపాదనను కూడా ప్రభుత్వం విరమించుకున్నది.
ఏడు మీటర్ల డయాతో రహదారుల కోసం నిర్మించిన సొరంగం పైభాగం నుంచి భూ ఉపరితలం వరకు 14 మీటర్ల దూరం ఉండాలి. అంటే కనీసం భూమి లోపల 21 మీటర్ల (69 ఫీట్లు) లోతు వరకు వెళ్లాలి. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో కేబీఆర్ పార్కు వద్ద ప్రతిపాదించిన సొరంగ మార్గం కోసం ఏకంగా వంద మీటర్ల వరకు వెళ్లాలని నిపుణులు సూచించారు. దీని ప్రకారం ఆయా ప్రదేశాల్లో నేల స్వభావాన్ని బట్టి లోతు నిర్ధారిస్తారు. ప్రస్తుతం జీహెచ్ఎంసీ ఈవోఐ టెండర్లు పిలిచిన జాబితాలో కీలకమైన హైటెక్ సిటీ, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాసబ్‌ట్యాంక్ మీదుగా మూసీని దాటుకొని పాతబస్తీ వరకు సొరంగ మార్గాలు ప్రతిపాదించారు. ఇలాంటి చోట్ల భూమి లోపల 70-100 ఫీట్ల వరకు వెళ్లి తవ్వుకుంటూ పోవాలంటే సాంకేతికంగా ఎంత సంక్లిష్టమో అర్థం చేసుకోవచ్చు.
మైదాన, గ్రామీణ ప్రాంతాల్లో సొరంగ మార్గానికి రెండు వైపులా కొంత దూరంలో రెండువైపులా ఆడిట్ టన్నెల్స్ నిర్మిస్తారు. అంటే మనుషుల రాకపోకలు, యంత్రం వెళ్లడం, మట్టి, రాళ్లను తరలించేందుకు టిప్పర్ల రాకపోకల కోసం వీటిని నిర్మిస్తారు. నగరంలో ఆరు కిలోమీటర్ల టన్నెల్ నిర్మాణానికి నాలుగు చోట్ల ఆడిట్ టన్నెల్స్ నిర్మించాలి. మరి నగరంలోని ఇంత ట్రాఫిక్, ఇరుకైన రహదారుల్లో ఇవి సాధ్యమా అనేది జవాబు లేని ప్రశ్నే.