మొయినాబాద్, ఫిబ్రవరి 23: నేరాల నియంత్రణలో జాగిలాల పాత్ర కీలకమని రాష్ట్ర డీజీపీ రవిగుప్తా అన్నారు. రంగారెడ్డి జిలా మొయినాబాద్‌లోని ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ అకాడమీలో పోలీసు జాగిలాల 23వ పాసింగ్ ఔట్ పరేడ్ శుక్రవారం జరిగింది. ఈ కార్యక్రమానికి డీజీపీ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ ఎన్నో కేసుల్లో నేరస్తులను పట్టుకోవడంలో పోలీసులకు జాగిలాలు ఎంతో సహకరించాయని చెప్పారు. తెలంగాణ ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ అకాడమీలో శిక్షణ పొందిన జాగిలాలు ఉత్తమ ప్రతిభ చూపి.. దేశంలోని ఇతర రాష్ర్టాల పోలీసులకు నుంచి ప్రశంసలు పొందుతున్నాయని ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీపీ శివధర్‌రెడ్డి అన్నారు.
ఐఐటీఏలో ఇప్పటి వరకు 771 జాగిలాలకు శిక్షణ ఇచ్చినట్లు ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ డీఐజీ తఫ్సీర్ ఇక్బాల్ అన్నారు. బిహార్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్ రాష్ర్టాలతో పాటు ఇతర రాష్ర్టాలకు చెందిన జాగిలాలకు కూడా శిక్షణ ఇచ్చినట్లు పేర్కొన్నారు. కాగా, శిక్షణ పొందిన జాగిలాల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. అలాగే ఐఐటీఏలో నూతనంగా నిర్మించిన క్రికెట్ మైదానాన్ని డీజీపీ రవిగుప్తా ప్రారంభించారు. కార్యక్రమంలో యాంటీ నార్కోటిక్స్ బ్యూరో డైరెక్టర్ సందీప్ శాండిల్య తదితరులు పాల్గొన్నారు.