సిటీబ్యూరో, ఏప్రిల్ 6 (నమస్తే తెలంగాణ) : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)లో పారదర్శకత పాతాళానికి చేరిందా? ప్రజా సమస్యలపై చర్చించాల్సిన అత్యున్నత స్థాయి కమిటీ సమావేశాలు ‘రహస్య కుట్ర’లకు వేదికవుతున్నాయా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. గత
బుధవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన స్టాండింగ్ కమిటీ సమావేశం సాగిన తీరు చూస్తుంటే.. ప్రజా ప్రయోజనాల కంటే ‘గోప్యత’కే పెద్దపీట వేసినట్లు స్పష్టమవుతోంది. జీహెచ్ఎంసీ, ఎంఎంసీ కార్పొరేషన్లలో సోమవారం స్పెషల్ ఆఫీసర్‌గా ఉన్న స్పెషల్ సీఎస్ జయేష్ రంజన్ అధ్యక్షతన
స్టాండింగ్ కమిటీ సమావేశం జరిగింది. జీహెచ్ఎంసీ పరిధిలో సుమారు పది కీలక అంశాలతో కూడిన ఎజెండాను, ఎంఎంసీ పరిధిలో 37 అంశాల ఎజెండాను గుట్టుచప్పుడు కాకుండా ఆమోదించడం చర్చనీయాంశంగా మారింది. తొలిసారిగా ఈ తరహా రహస్యంగా జరగడంపై అనుమానాలు
వ్యక్తమవుతున్నాయి. కార్పొరేషన్ నిర్ణయాలు ప్రజలకు తెలియపోవడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్దమనే విమర్శలు వినిపిస్తున్నాయి.
మౌలిక సదుపాయాల అభివృద్ధి పేరుతో తెరపైకి వచ్చిన ఈ ప్రతిపాదనల వెనుక ఒక బడా ‘రాజకీయ హస్తం’ ఉన్నట్లు బల్దియా వ ర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. గత స్టాం డింగ్ కమిటీ సమావేశంలో కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి భార్య పేరిట ప్రభుత్వ స్థలాన్ని అప్పన్నంగా కట్టబెట్టిన తీరు వెలుగులోకి రావడం ఇందుకు కారణమని తెలుస్తున్నది. నగరంలోని కొన్ని ప్రధాన ప్రాజెక్టుల టెండర్లలో తమకు అనుకూలమైన వారికి లబ్ధి చేకూర్చేందుకే ఈ ‘గోప్యతా డ్రామా’ ఆడుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
దాదాపు 37 అంశాలకు ఆమోదం తెలిపినట్లు తెలుస్తున్నప్పటికీ అందులో ప్రజా ప్రయోజనం ఎంత? అనే చర్చ మొదలైంది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి మొత్త బడ్జెట్‌ను రూ.11,460 కోట్లుగా అంచనా వేయగా… ఇందులో స్టాండింగ్ కమిటీ అంచనా ప్రకారం రూ.3,867.75 కోట్లను అప్పోర్షన్డ్ బడ్జెట్‌గా కేటాయించే
ప్రతిపాదనను కమిటీ ముందుకు తీసుకొచ్చారు. ఔట్‌సోర్సింగ్‌లో పనిచేస్తున్న శానిటేషన్ వర్కర్లు, ఇతర విభాగాల ఉద్యోగుల వేతనాల పెంపునకు ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ కోసం ప్రతిపాదన, పలువురు సీనియర్ అసిస్టెంట్లకు సూపరింటెండెంట్లుగా, బిల్ కలెక్టర్లకు సీనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతులు కల్పించే అంశంపై
కమిటీలో నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. మొత్తంగా పారదర్శకత గురించి గొప్పలు చెప్పే పాలకులు, అధికారుల నోటికి ఇప్పుడు ‘తాళం’ ఎందుకు పడిందోనన్న చర్చ జరుగుతున్నది.