Numaish | అబిడ్స్, ఫిబ్రవరి 10: నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో కొనసాగుతున్న అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శనను వారం రోజులపాటు పొడిగించాలని స్టాల్ యజమానులు ఎగ్జిబిషన్ సొసైటీకి విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రతి సంవత్సరం జనవరి 1 నుంచి ఫిబ్రవరి 15వ తేదీ వరకు అఖిలభారత పారిశ్రామిక ప్రదర్శన 46 రోజుల పాటు కొనసాగిస్తూ వస్తున్నారు. కాగా ఈ సంవత్సరం జనవరి ఒకటో తేదీన ప్రారంభం కావాల్సిన అఖిలభారత పారిశ్రామిక ప్రదర్శన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి చెందడంతో సంతాప దినాల కారణంగా జనవరి మూడో తేదీ నుంచి ప్రారంభించారు.
అయితే ఎగ్జిబిషన్‌ను వారం రోజులపాటు పొడిగించాలని స్టాల్ యజమానులు సొసైటీ ప్రతినిధులను కలిసి విజ్ఞప్తి చేస్తూ వస్తున్నారు. కాగా పోలీస్ శాఖ మాత్రం ఎగ్జిబిషన్‌ను పొడిగించేది లేదని ఆదివారం పేర్కొన్నట్టు తెలిసింది. స్టాల్ యజమానులు మాత్రం తమకు వారం రోజులు పాటు నుమాయిష్ పొడిగించకపోతే నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుందని వారు సొసైటీ ప్రతినిధులకు విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిసింది. ఎగ్జిబిషన్స్ సొసైటీ ఈ విషయంపై ఏ నిర్ణయం తీసుకుంటుందో అని స్టాల్ యజమానులు ఎదురుచూస్తున్నారు.