సిటీబ్యూరో, ఫిబ్రవరి 11 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్ వేదికగా అంతర్జాతీయ ఫార్ములా-ఈ రేసింగ్ పోటీలకు సర్వం సిద్ధమైంది. నగరం నడిబొడ్డున హుస్సేన్‌సాగర్ తీరంలో నిర్మించిన ఫార్ములా-ఈ ట్రాక్ చుట్టూ పటిష్టమైన బందోబస్తు, భద్రతా ఏర్పాట్లు చేశారు. దేశంలోనే మొట్ట మొదటి సారిగా హైదరాబాద్‌లో జరుగుతున్న అంతర్జాతీయ ఫార్ములా -ఈ రేసింగ్ పోటీలు కావడంతో దానికి అనుగుణంగానే ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వంతో పాటు ప్రైవేటు సంస్థలుగా ఉన్న గ్రీన్కో, ఏస్ నెక్ట్స్ జెన్ సంస్థలు ఫార్ములా- ఈ రేసింగ్ మ్యాప్‌ను ప్రత్యేకంగా రూపొందించాయి. ఫార్ములా-ఈ రేసింగ్ ట్రాక్‌కు ‘హైదరాబాద్ స్ట్రీట్ సర్యూట్’గా పేరు నిర్ణయించారు. దీని చుట్టూ రకరకాల ఏర్పాట్లు చేసి, వాటిని మ్యాప్ ద్వారా తెలుసుకునే విధంగా చర్యలు చేపడుతున్నారు. ఏస్ నెక్ట్స్ జెన్ వెబ్సైట్లో పోటీలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని పొందుపర్చారు. 22వేల మందికి పైగా ప్రేక్షకులు రేసింగ్ పోటీలను వీక్షించేలా భద్రతతో ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే రెండు దఫాలుగా బుక్ మై షోలో టికెట్ల విక్రయాలను చేపట్టారు.
హుస్సేన్‌సాగర్ తీరంలో 2.8 కి.మీ పొడవునా ఏర్పాటు చేసిన ట్రాక్ చుట్టూ 7 చోట్ల గేట్లు ఏర్పాటు చేశారు. నిర్ణయించిన ప్రాంతాల్లో పార్కింగ్ స్థలాలు అందుబాటులో ఉంచి, అక్కడ ప్రేక్షకులు తమ వాహనాలను పార్కింగ్ చేసిన తర్వాత ట్రాక్ వద్దకు షటిల్ సర్వీసుల్లో ఉచితంగా ప్రయాణించేలా నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. ప్రధాన రేస్ ఫిబ్రవరి 11న ఉండగా, 10వ తేదీన విద్యార్థుల కోసం మధ్యాహ్నం 3 నుంచి 4:20 గంటల వరకు, మహీంద్రా టీమ్‌తో కనెక్ట్ అయ్యేందుకు సాయంత్రం 5:15 నుంచి 6:15 గంటల వరకు సమయాలను కేటాయించారు. ఇక పోటీలు జరిగే రోజు గేట్లను ఉదయం 7:30 నుంచే తెరుస్తామని, క్వాలిఫయింగ్ రేస్ ఉదయం 10:40కి నిర్వహిస్తుండగా, డ్రైవర్స్ పరేడ్ మధ్యాహ్నం 1:40 నుంచి 1:55 గంటల వరకు ఉంటుంది. ప్రధాన రేస్ సరిగ్గా 3 గంటలకు ప్రారంభమవుతుందని నిర్వాహకులు తెలిపారు.