Panjagutta PS | సిటీబ్యూరో: నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఒక ఠాణాలో పనిచేస్తున్న సిబ్బందినంతా ఒకే సారి బదిలీ చేయడం సంచలనంగా మారింది. ఈ చర్యతో అవినీతి అక్రమాలు, విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించే వారిలో గుబులు మొదలైంది. ఒక నాడు బెస్ట్ పోలీస్‌స్టేషన్‌గా ఉన్న పంజాగుట్ట ఠాణా నేడు ఆ ఖ్యాతి కోల్పోయింది.
ఒక రోడ్డు ప్రమాదం నుంచి నిందితులను తప్పించేందుకు ప్రయత్నించిన ఇన్స్పెక్టర్ వ్యవహారంతో సిబ్బంది అవినీతి, అక్రమాల డొంకలు బయటపడుతున్నాయి. ఈ ఠాణాలో పనిచేస్తున్న ఎస్సై నుంచి హోంగార్డు వరకు 85 మందిని( బదిలీ అయిన వారిలో 6 గురు ఎస్సైలు, 8 మంది ఏఎస్సైలు, 16 మంది హెడ్ కానిస్టేబుల్స్, మిగతా వారు కానిస్టేబుళ్లు ఉన్నారు). ఒకే సారి పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి బుధవారం కార్ హెడ్ క్వార్టర్స్‌కు అటాచ్ చేయడం చర్చనీయాంశమైంది.
ప్రజలకు పారదర్శకమైన పాలన అందించాలనేది ప్రభుత్వాల లక్ష్యంగా ఉంటుంది. పోలీసుల్లో సగం మందికి పైగా డబ్బు సంపాదనే ధ్యేయంగా పనిచేస్తున్నారు. పెట్రోలింగ్, బ్లూకోల్ట్స్ నుంచి కేసు దర్యాప్తు చేసే సెక్టార్ ఎస్సై, ఎస్‌హెచ్‌వో, కొందరు ఏసీపీలు సైతం ఈ అవినీతి అక్రమాల్లో భాగస్వాములవుతున్నారు. పంజాగుట్టలో జరిగిన రోడ్డు ప్రమాదం ఘటన చిన్నదే అయినా, ఇన్స్పెక్టర్ ఈ విషయంలో అతి ఉత్సాహం ప్రదర్శించి డబ్బుకు దాసోహమయ్యారు. నిబంధనల ప్రకారం రోడ్డు ప్రమాదం చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేయాల్సిన ఇన్స్పెక్టర్ దానిని కప్పి పుచ్చుతూ.. అమాయకుడిని నిందితుడిగా మార్చేందుకు ప్రయత్నించారు.