సిటీబ్యూరో, జూలై 30(నమస్తే తెలంగాణ): ఎన్నికల కమిషన్ జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 163 మంది ఇన్స్పెక్టర్లను బదిలీ చేస్తూ నగర పోలీస కమిషనర్ సీవీ ఆనంద్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా బదిలీ అయిన ఇన్స్పెక్టర్లతో కమాండ్ కంట్రోల్ సెంటర్లోని ఆడిటోరియంలో వారితో సమావేశమయ్యారు, అనంతరం, వీడియో కాన్ఫరెన్స్‌లో నగరంలోని అన్ని పోలీస్స్టేషన్ల ఎస్హెచ్ఓలు, ఆపై స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ మెగా సిటీ పోలీసింగ్‌లో భాగంగా ఇటీవల హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పునర్ వ్యవస్థీకరణ జరిగిన తరువాత, మరోసారి బదిలీలతో అధికారుల పునర్ వ్యవస్థీకరణ చేసినట్లు తెలిపారు. స్టేషన్ హౌస్ ఆఫీసర్లు, ఇతర కీలక బాధ్యతలను ఇన్స్పెక్టర్లకు అప్పగించే ప్రక్రియలో పాల్గొని సమర్థులైన అధికారులకు ఆయా బాధ్యతలను అప్పగించామన్నారు.
ఇతర పోలీస్ విభాగాల నుంచి కొత్త అధికారులు సిటీలోకి వచ్చారని, సిటీ పోలీస్ పునర్ వ్యవస్థీకరణ, మౌలిక సదుపాయాలు, పోలీసింగ్‌లో మార్పుల గూర్చి ఆయన అధికారులకు వివరించారు. కొత్త అధికారులకు ఆయా స్టేషన్ల పరిధిలోని పరిస్థితులను, పాలనాపరమైన సమస్యలను వివరించి బదిలీపై వెళ్లే అధికారులు, బదిలీపై ఆ స్థానంలోకి వచ్చే కొత్త అధికారులకు వివరించాలని ఆదేశించారు. నగరంలో శాంతి భద్రతల పరిరక్షణలో ప్రతి ఒక్కరు ఎంతో సహకారం అందించారని, వారికి ధన్యవాదాలు తెలిపారు. నగరానికి కొత్తగా చాలా మంది అధికారులు వచ్చారని, సిబ్బంది సంక్షేమం కూడా చాలా ముఖ్యమైనదని అన్ని జోన్లు, పోలీస్స్టేషన్లలో ఆయా విధులు, పనిభారం ప్రకారం, కచ్చితంగా 3 షిప్ట్‌లు ఉంటాయన్నారు. అనంతరం, అడ్మిన్, కార్ హెడ్ క్వార్టర్స్ అండ్ ట్రైనింగ్ అంశాలపై ఆయా జాయింట్ సీపీలు మాట్లాడారు. ఈ సమావేశంలో అదనపు సీపీ విక్రమ్ సింగ్ మాన్, జాయింట్ సీపీలు విశ్వప్రసాద్, గజారావు భూపాల్ పాల్గొన్నారు.