బడంగ్పేట్, నవంబర్ 21:గుంతలమయంగా మారిన శ్రీశైలం హైవే రోడ్డుకు మరమ్మతులు చేయించాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే పి.సబితా ఇంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. జల్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఎర్ర కుంట దగ్గర ఉన్న శ్రీశైలం నేషనల్ హైవే రోడ్డును ఆమె శుక్రవారం పరిశీలించారు.
మహేశ్వరం మండలం రామచంద్రగూడలో ఏర్పాటు చేసిన అయ్యప్ప మహాపడి పూజలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోకి వచ్చే రోడ్డును నేషనల్ అథారిటీ పరిధిలోకి తీసుకొని రూ.80 కోట్లు గతంలో మంజూరు చేసినట్లు చెప్పారు. చంద్రాయనగుట్ట పరిధిలోకి వచ్చే 1.8 కిలోమీటర్లు మిగిలిన రహదారిని ఆర్అండ్బీ శాఖ ద్వారా రూ.20 కోట్లు మంజూరు చేసినట్లు చెప్పారు.
చంద్రాయనగుట్ట మహేశ్వరం నియోజకవర్గం పరిధిలోని జల్పల్లి గేటు వరకు రూ.100 కోట్లతో 5.8 కిలోమీటర్ల ఫోర్లైన్స్ రోడ్డు వేయడానికి నేషనల్ అథారిటీ నామ్స్ ప్రకారం నిర్మాణం చేయవలసి ఉందన్నారు. సెంట్రల్ లైట్స్ ఏర్పాటు చేయడానికి, డ్రైనేజీ వేయడానికి గతంలోనే ప్రణాళికలు రూపొందించారని చెప్పారు. అధికారికంగా ప్రారంభం చేయడానికి కొంత ఆలస్యమైతే రోడ్డుకు తాత్కాలిక మరమ్మతులు చేయించాలని ఆమె అధికారులను ఆదేశించారు.
గుంతలమయంగా మారిన రోడ్లపై ప్రయాణించాలంటే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. రాత్రి వేళల్లో ఈ రోడ్లపై ప్రయాణించలేని పరిస్థితి ఉందన్నారు. అధికారులు దృష్టి సారించి త్వరగా పనులు చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో కమిషనర్ వెంకట్రామ్, మాజీ సర్పంచ్ సూరెడ్డి కృష్ణారెడ్డి, అబ్దుల్, షర్పదీన్ ప్రజా ప్రతినిధులు , కోఆప్షన్ సభ్యులు తదితరులు ఉన్నారు.